Heart Attack | కాజీపేట, జూలై 13: భవనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కాజీపేట రైల్వే జంక్షన్లో రైలును ఆపించి, ప్రయాణికుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
రైల్వే సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన పోయాడ వెంకటరమణ(59) లింగంపల్లికి వచ్చేందుకు విశాఖపట్నంలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. రైలు వరంగల్ స్టేషన్ దాటగానే వెంకటరమణ అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడుతుండటం గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.
రైలు కాజీపేట రైల్వే జంక్షన్‌కు చేరుకోగానే 108 ఈఎంటీ చైతన్య, పైలట్ కుంట రవి హుటాహుటిన రైలు బోగీ దగ్గరకు చేరుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న ప్రయాణికుడిని జాగ్రత్తగా రైలులో నుంచి దించి, అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.