జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, మే 13 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో 65 శాతం, ములుగు నియోజకవర్గంలో 68.2 శాతం ఓటింగ్ నమోదైంది. చిన్న చిన్న ఘటనలు మినహా ఇరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా ఈవీఎంలు మోరాయించడంతో ఓటర్లు కొంతసేపు వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. పలు గ్రామాల్లో పోల్ చిట్టీలు అందక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల పేర్లను తొలగించడంతో వెనుదిరుగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భూపాలపల్లి నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 61.04 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈ సారి 4 శాతం ఓటింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో 82.04 శాతం నమోదవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేసినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు కేవలం 9 శాతం మాత్రమే పోలింగ్ అయింది. 11 గంటలకు 26 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 45 శాతం, 3 గంటలకు 58 శాతం, నాలుగు గంటలకు 65 శాతం పోలింగ్ నమోదైంది.
ములుగు నియోజకవర్గంలో 68.2శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం నమోదైన పోలింగ్‌ను చూస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే భారీగా తగ్గింది. ఎండకాలం దృష్ట్యా ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. అలాగే ఓటరు లిస్టులో పేర్లు గల్లంతు కావడం, పోల్ చిట్టీల పంపిణీలో అధికారులు అలసత్వం వహించడంతో కొందరు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 9గంటలకు 10.38శాతం నమోదైంది. 11గంటలకు 29.79శాతం, ఒంటి గంట వరకు 50.66శాతం నమోదైంది.
మధ్యాహ్నం 3గంటలకు 61.23శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రానికి 68.2శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన వాహనాల్లో రూట్ల వారీగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని ఈవీఎంలు, సామగ్రిని అప్పగించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ములుగు జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియను, ఈవీఎంల తరలింపు ప్రక్రియను దిగ్విజయంగా పూర్తి చేశారు.
వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సుధీర్‌కుమార్ భూపాలపల్లి మండలంలో పర్యటించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి పోలింగ్ సరళిని పరిశీలించారు. భూపాలపల్లి, జంగేడు, గొర్లవీడు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర గణపురం మండలం చెల్పూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. మహదేవపూర్ మండలకేంద్రంతో పాటు మల్హర్ మండలం తాడిచర్ల,
మల్లారంలో పోలింగ్ సరళిని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరా తీశారు. గణపురం మండల కేంద్రంతో పాటు బుద్ధారం, కరపెల్లి, చిట్యాల మండల కేంద్రంతో పాటు చల్లగరిగ, నవాబుపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, మహదేవపూర్ మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పోలింగ్ సరళిని రామగుండం సీపీ శ్రీనివాసులు పరిశీలించారు. ములుగు ఎస్పీ డాక్టర్ పీ శబరీశ్ మల్లంపల్లి, జాకారం పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్‌ను పరిశీలించి పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా కలెక్టర్, అదనపు కలెక్టర్‌తో కలిసి ములుగులోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా కేంద్రం, మహదేవపూర్ మండలంలో ఓటర్లకు పోల్ చిట్టీలు అందక తీవ్ర ఇబ్బందులుపడ్డారు. బీఎల్వోలు చిట్టీలను తమ వద్దే ఉంచుకోవడంతో ఓటరు కార్డు, ఆధార్ కార్డులను వెంట తెచ్చుకొని ఓటు వేసేందుకు రాగా ఎన్నికల సిబ్బంది పోల్ చిట్టీ కావాలనడంతో ఆందోళన చెందారు. బీఎల్వోల వద్దకు వెళ్లి పోల్ చిట్టీలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా కాలనీలో తెలిసిన వారికి ఇచ్చామని, వారి వద్ద తెచ్చుకోవాలని అనడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేసేది ఏమీలేక ఓటరు లిస్ట్‌లో గంటల తరబడి తమ పేర్లు, సిరియల్ నంబర్‌ను వెతుకుతూ అవస్థలు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే సమస్య తలెత్తిందని వారు తెలిపారు. కాగా, అసలు విషయానికొస్తే బీఎల్వోలు ములుగు జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లోని కాంగ్రెస్ నాయకులకు ఓటర్ల పోల్ చిట్టీలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీకి ఓటు వేసే వారికే ఇంటింటికీ తిరిగి పోల్ చిట్టీలు ఇచ్చారు. అలసత్వం వహించిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరారు.
భూపాలపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన 14వ పోలింగ్ బూత్‌లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, తేజస్విని గాంధీ కళాశాలలోని 43వ పోలింగ్ బూత్‌లో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, గొర్లవీడులో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, కాటారం మండలకేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కాటారం మండలం ధన్వాడలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తన స్వగ్రామం గణపురం మండలం బుద్ధారంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంజూర్‌నగర్‌లోని 79వ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ భవేశ్‌మిశ్రా, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఓటర్లతో కలిసి క్యూలో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ కిరణ్ ఖరే దంపతులు కుందూరుపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ములుగు మండలం జగ్గన్నపేట ఆశ్రమ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి సీతక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ ఓటు వేశారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలకేంద్రంలోని 175వ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయించగా అధికారులు మరో ఈవీఎంను సమకూర్చారు. అన్నారంలోని 168వ బూత్‌లోని ఈవీఎం మొరాయించడంతో 10 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. మల్హర్ మండలం తాడిచర్లలోని 248వ బూత్‌లో ఈవీఎం 45 నిమిషాల పాటు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కాటారం మండలం ఇబ్రహీంపల్లి, శంకరంపల్లి, చిదినెపల్లి గ్రామాల్లో ఈవీఎంలలో సాంకేతిక సమస్య రాగా కొద్ది సేపు పోలింగ్ నిలిచిపోయింది.
దానిని సరిచేయడంతో తిరిగి కొనసాగింది. టేకుమట్ల మండలకేంద్రంలోని 102వ బూత్‌లో మాక్ పోలింగ్ ఆలస్యం కావడంతో 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాఘవారెడ్డిపేట 173వ బూత్‌లో చివరి దశలో ఈవీఏం పనిచేయకపోవడంతో దానిని సరిచేసి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలోని లక్ష్మీనగరం 37వ పోలింగ్ బూత్‌లో సాయంత్రం 4 గంటల సమయంలో ఈవీఎం మొరాయించడంతో సుమారు గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.
వాజేడు : మండలంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం పెనుగోలు గుట్టలపై నివసిస్తున్న ప్రజలు మూడు గుట్టలు, మూడు వాగులు దాటి 16 కిలో మీటర్లు కాలినడకన వచ్చి ఓటు వేశారు. జంగాలపల్లి 17వ పోలింగ్ కేంద్రంలో 11 మందికిపైగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వీరిని గుమ్మడిదొడ్డి గ్రామం నుంచి ఆటో ద్వారా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటు వేసిన అనంతరం భోజన సదుపాయం కల్పించినట్లు తహసీల్దార్ శ్రీరాముల శ్రీనివాస్ తెలిపారు. పలు గ్రామాల్లో తమకు ఓటు వేసేందుకు డబ్బులు ఇవ్వలేదని మహిళా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జంగాలపల్లి పోలింగ్ కేంద్రం సమీపంలో ఇద్దరు మహిళలు అక్కడ నాయకులను తమకు డబ్బులు ఇవ్వాలని కనీసం రూ.100 అయినా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేయడం విస్మయానికి గురిచేసింది.