ఐనవోలు, జూలై 2 : చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిగా అతడి జ్ఞాపకాలను మాత్రం ఆ తల్లిదండ్రులు మరువలేకపోతున్నారు. దీంతో కుమారుడి రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలని అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల తిరుపతి-నిర్మల దంపతులకు బీటెక్ చదువుతున్న కుమారుడు అభిలాష్ (లడ్డు) ఉన్నాడు.
గతేడాది జూన్ 30న మండలంలోని పున్నేల్ క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన అభిలాష్ చికిత్స పొందుతూ జూలై 14న మృతి చెందాడు. అయితే అతడి జ్ఞాపకాలు మరిచిపోలేకపోతున్న తల్లిదండ్రులు అచ్చు కొడుకు మాదిరిగానే విగ్రహాన్ని తయారు చేయించారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తమ బావి వద్ద బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, నాయకులు, స్నేహితులు గణేశ్, పరుశురాములు, రాజు, రమణయ్య, విజయ్‌కుమార్, కోటేశ్వర్, రమేశ్, అజీమ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.