రాయపర్తి: సమాజంలోని సకల వర్గాల ప్రజలందరి సంపూర్ణ సహాయ సహకారాలతోనే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం చేకూరుతుందని రాయపర్తి (Raiparthy) జడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపల్ గారె కృష్ణమూర్తి అన్నారు. జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల, మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలల ఆవరణలో విద్యార్థుల నమోదుపై ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ ఉచిత విద్యను అందించాలన్న సంకల్పంతో ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలలపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉచితంగా స్కూల్ యూనిఫార్మ్స్, పాఠ్యపుస్తకాలు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు.
ప్రజలంతా తమ పిల్లలను సర్కారు బడులకు పంపాలని, విద్యార్థులకు సక్రమంగా విద్యాబోధన అందని పక్షంలో ఉపాధ్యాయులను నిలదీయవచ్చునని సూచించారు. విద్యార్థుల నమోదు విషయంలో ప్రైవేటు, కార్పొరేటు, టెక్నో పాఠశాలలు చేస్తున్న విష ప్రచారాలు, అబూత కల్పనలను నమ్మి మోసపోవద్దని కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, రేషన్ డీలర్లు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు ఎస్వీబీ శర్మ, పెదగాని సురేందర్, సతీష్, రోజా రాణి, ఉప్పలయ్య, నరసింహులు, యోగా శ్రీ, ఉమాదేవి, శోభ, వివేక్, లక్ష్మి, స్వాతి, నరేష్, శ్రీదేవి, సహిస్తాబేగం, రాధా, సీఆర్పీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.