ఆత్మకూరు, డిసెంబర్ 8 : తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత కొత్తపల్లి జయశంకర్ సార్ స్వగ్రామమైన అక్కంపేట ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి అక్కంపేట గ్రామంలోని జయశంకర్, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రేవూరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో పత్రాన్ని విగ్రహాల సాక్షిగా ప్రజలకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జయశంకర్ పుట్టి పెరిగిన గ్రామానికి రెవెన్యూ హోదా కావాలనేదే ప్రజల చిరకాల వాంఛ అని, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ఈ గ్రామానికి రచ్చబండ కార్యక్రమానికి వచ్చారని, ప్రజలు అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేయాలని విన్నవించుకున్నారనారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెవెన్యూ గ్రా మంగా ప్రకటిస్తానని చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా మార్చుతూ జీవో పత్రం అందజేశారన్నారు. జీవో కాపీని గ్రామానికి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాననే నమ్మకం వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు, గీసుగొండ ఎంపీపీలు మార్క సుమలత-రజనీకర్, బీమగాని సౌజన్య, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, మండలాధ్యక్షుడు కమలాపురం రమేశ్, జిల్లా నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గోపు మల్లికార్జున్, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ముద్దం సాంబయ్య పాల్గొన్నారు.