జెండా పండుగ వేళ పలు కట్టడాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెంకటాపూర్‌లోని రామప్ప ఆలయం, వరంగల్ రైల్వేస్టేషన్, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సరికొత్త శోభ సంతరించుకున్నాయి.
– ఖిలా వరంగల్/వెంకటాపూర్, ఆగస్టు 14
జెండా పండుగకు సర్వం సిద్ధమైంది. ఈమేరకు ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో గురువారం స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా పరేడ్ గ్రౌండ్లు ముస్తాబయ్యాయి. అలాగే మంత్రులు, ఇన్చార్జీల చేతులమీదుగా పతాకావిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాలను తెలిపే స్టాళ్ల ఏర్పాట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారాలు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులు, సిబ్బందికి పురస్కారాలు, తదితర ఏర్పాట్లపై ఇటు అధికార యంత్రాంగం, బందోబస్తుపై పోలీసు శాఖ పర్యవేక్షిస్తున్నది.
హర్ ఘర్ తిరంగాలో భాగంగా చారిత్రక ఓరుగల్లు కోటలోని కీర్తితోరణాల మధ్య కేంద్ర పురావస్తు శాఖ ఏర్పాటుచేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పర్యాటకులు పిల్లలు, పెద్దలు ఇలా సెల్ఫీ దిగుతూ మురిసిపోయారు. అలాగే ఖిలా వరంగల్ కోటలో చేతిలో జెండాతో ఎన్సీసీ కెడెట్లు తీసిన కవాతు ఆకట్టుకున్నది.
– వరంగల్ ఫొటోగ్రాఫర్ , ఆగస్టు 14