జనగామ, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి పంటలకు సకాలంలో నీటి ని విడుదల చేయకుంటే రైతులతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం విడుదలైన ఒక ప్రకటనలో రైతులకు నష్టం కలిగించే ఏ చర్యలను ప్రభుత్వం తీసుకున్నా ఉపేక్షించబోమని స్పష్టం చేశా రు.
దేవాదుల ప్రాజెక్టులో భాగంగా గండిరామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, లద్నూర్, తపాస్పల్లి.. జనగామ నియోజకవర్గంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సీజన్ ప్రారంభమై, నాట్లు ముగింపు దశకు వచ్చినా అధికారులకు, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు.
ప్రతిరోజూ రైతులు తనకు సమస్యలు చెబుతుంటే పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ఇరిగేషన్ కార్యదర్శి సహా ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, డీఈ, ఏ ఈల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్య లు తీసుకోకపోగా, దేవాదుల అన్ని పంపులను బంద్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే అన్ని పంపులను, మోటర్లను ఆన్ చేసి రిజర్వాయర్లు, చెరువులను నింపి పంటలను కాపాడాలని కోరారు. రిజర్వాయర్లు, చెరువులు నింపకపోతే రైతులతో కలిసి పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.