జనగామ, మార్చి 15 (నమస్తే తెలంగాణ) : సకాలంలో రిజర్వాయర్లు నింపకపోవడం వల్ల దేవాదుల ఆయకట్టు కింద రూ. 600 కోట్ల పంట నష్టం జరిగిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ నియోజకవర్గంలోని రిజర్వాయర్లను నింపి, ఎండిన పంటలకు ఎకరానికి రూ. 20 వేల పరిహారం అందించాలని కోరారు. శనివారం అసెంబ్లీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై పల్లా గళమెత్తారు. జనగామ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ దేవాదుల ఆయకట్టులో ఉంటాయన్నారు. ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో గత 60 రోజుల్లో 40 రోజులు మాత్రమే దేవాదుల పంపులు నడిపారన్నారు. దాదాపు 5.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాల్సి ఉంటే 3 లక్షల ఎకరాలకు ఇస్తామని చెప్పి 34 రోజుల్లో రూ. 6 కోట్లు ఇవ్వకపోవడంతో భారీ నష్టం జరిగిందన్నారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో డెడ్‌స్టోరేజీకి చేరుకుందని, ఉన్న కొద్ది నీళ్లు మాకే రావాలని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, గండిరామారానికి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మె ల్యే వచ్చి మేం తీసుకుపోతం అంటరని అన్నారు. బిల్లులు చెల్లించలేదని సిబ్బంది సమ్మె చేస్తే అధికారులు, ప్రభుత్వం పట్టించుకోలేదని, దీంతో మోటర్లు ఆలస్యంగా ఆన్ చేయడంతో పంటలు ఎండి రైతులకు రూ. 600 కోట్ల నష్టం జరిగిందన్నారు. ‘నేను చెప్పేది అబద్ధం అయితే మీ అందరి సాక్షిగా నా ముకు నేలకు రాస్తా’ అని సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో 72 లక్షల మంది రైతులకు రూ. 80 వేల కోట్లు 12 విడతలుగా ఇస్తే ఈ ప్రభుత్వం గత వానకాలం, ఈ యాసంగీకి ఇవ్వలేదన్నారు.
గతంలో నీటి తీరువాను రద్దు చేసి అన్ని జలాశయాలు నింపామని, ఇప్పుడు జనగామలో జిల్లాలోని తపాస్‌పల్లి, గండిరామారం, బొమ్మకూర్, కన్నెబోయినగూడెం, లద్నూర్ సహా అన్ని రిజర్వాయర్లు ఎండిపోయాయన్నారు. దేవాదులలో నీళ్లు వస్తున్నాయని, మొదటి, రెండో దశలు పూర్తయ్యాయని, థర్డ్ ఫేస్ నిర్మాణం కూడా జరిగిందని, దీనిని వెంటనే ప్రారంభించి రిజర్వాయర్లు నింపాలని పల్లా విజ్ఞప్తి చేశారు. లోవోల్టేజీతో ట్రాన్స్ ఫార్మర్లు కాలుతున్నాయని, అటు నీళ్లు, ఇటు కరెంటు సమస్యతో ఇప్పటికే 50 శాతం పంటలు ఎండిపోయాయన్నారు. ‘నమ్ముకొని అధికారం ఇస్తే నమ్మకం పోగొట్టుకుంటివి..పదవి, అధికారం బూని పదిలంగా తల బోడిజేస్తివి.. టోపీ పెడితివి లాభపడితివి’ అన్న ప్రజాకవి కాళోజీ మాటలు ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా సరిపోతాయన్నారు.
తెలంగాణ చిహ్నం నుంచి కళాతోరణం, చార్మినార్ తీయాలని చూస్తున్నారని, వరంగల్ వాళ్లం ఆత్మగౌరవం ఉన్నోళ్లమని, వరంగల్ మహనీయులైన రాణీ రుద్రమదేవి, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక సారలమ్మ సాక్షిగా ఆత్మగౌరవం కోసం పొరాడుతామని పల్లా అన్నారు. రాజముద్రలో నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్ మార్చొద్దని, మారిస్తే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ‘రైతు రుణమాఫీపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నది. జనగామ నియోజకవర్గంలోని 127 గ్రామాల్లో ఎక్కడికైనా పోదాం.. ఎక్కడైనా 100 శాతం మాఫీ జరిగినట్టు నిరూపిస్తే ముకు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.
జనగామ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న నీటి గోసపై అసెంబ్లీలో నిలదీయడంతో తేరుకున్న ప్రభుత్వం శనివారం సా యంత్రం తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు దేవాదు ల నీటిని విడుదల చేసిందని పల్లా అన్నారు. దేవాదుల ఓఅండ్ఎం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేక 34 రోజులు మోటర్లు ఆన్ చేయని అసమర్థ కాంగ్రెస్ వల్లే జనగామకు మునుపటి కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. ఆగకుండా మోటర్లు నడిస్తే రిజర్వాయర్లన్నీ నిండి పొలాలకు నీళ్లు వచ్చేవన్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడినా వినియోగించుకోలేక వేల టీఎంసీలు గోదావరిలో కలిశాయని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ నాయకులకు చీమ కుట్టినట్టయినా లేదన్నారు. వెంటనే దేవాదుల ఫేజ్-3 మోటర్లను ప్రారంభించి పొలాలకు నీళ్లందించాలని, ఎండిన పంటలకు సాయం ప్రకటించాలని పల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.