ఆరు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్‌గా మారుస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు రద్దవుతాయని, మార్పులు, చేర్పులుంటాయన్న ప్రచారం సాగుతున్నది. మొన్న అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నిన్న హనుమకొండలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యంపోస్తున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలతో పాటు పలు భవనాలను నిర్మించింది. అయితే రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లాల పునర్విభజనలో మార్పులు చేస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా జిల్లాలను విభజించిందని, దీంతో వరంగల్‌కు అపార నష్టం సంభవించిందని, చారిత్రక కట్టడాలు ఉనికి కోల్పోయాయంటూ ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయ రగడకు దారి తీయగా.. పాలన చేతకాక, హామీలు అమలు చేయక ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి జిమ్మిక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు.
జనగామ, జనవరి 12 (నమస్తే తెలంగాణ) : జనగామ జిల్లాను మూసేస్తే మీ ప్రభుత్వం మూత పడుతది.. మీ పార్టీ మూత పడుతది.. పోరాటాలతో తెచ్చుకున్న జిల్లాను ఎవరు ముట్టుకుంటే మాడి మసైతరు జాగ్రత్త.. ప్రజలతో ఆడుకోవద్దు’ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న జిల్లాను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డి కలిసి రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడియం మొదటి నుంచి జనగామ జిల్లాను వ్యతిరేకిస్తున్నాడని, తాము అధికారంలోకి వస్తే సర్వాయి పాపన్న పేరు పెడతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. జేఏసీ ఏర్పాటు చేసుకొని కష్టపడి జిల్లాను సాధించుకుంటే అక్కడ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలను కుదిస్తున్నామని చెబుతున్నాడని, ఇక్కడ కడియం, నాయిని జిల్లాలు వద్దని అంటున్నారని, ప్రాథమికంగా ప్రభుత్వంతో చర్చలు జరిగిపోయాయని, ఏదో ఓ రోజు జనగామ జిల్లాను మూసేస్తామని మాట్లాడుతున్నారని అన్నారు. పరిపాలనా సౌలభ్యం, వికేంధ్రీకరణ కోసం అప్పటి సీఎం కేసీఆర్ దూరదృష్టితో హైదరాబాద్-వరంగల్‌కు మధ్య ఉన్న జనగామను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతో అద్భుతమైన కలెక్టరేట్ నిర్మించుకున్నామని, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఆస్పత్రి తెచ్చుకున్నామని, నవోదయ స్కూల్ కోసం దరఖాస్తు చేసి మంజూరుకు యత్నిస్తుంటే కొంతమంది నాయకులకు ఇది నచ్చడంలేదన్నారు.
12 మండలాల ప్రజలకు జనగామ జిల్లా కేంద్రం సౌకర్యంగా ఉందని, ఎవరికీ ఇబ్బందులు లేవని, అలాంటప్పుడు కడియంకు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అన్యాయంగా విడదీశారని, హనుమకొండ, వరంగల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలను కలిపి ఉమ్మడి వరంగల్‌గా మార్చాలని సీఎంను కోరానని ఇటీవల ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన ప్రకటనే కుట్రకు నిదర్శనమని పేర్కొన్నారు. జనగామను మూసేయడం, తీసేయడం కాదని, జిల్లా సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు సహించరని పల్లా అన్నారు.
తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జనగామ మున్సిపాలిటీకి రూ.30 కోట్లు అర్బన్ డెవలప్మెంట్ నుంచి నిధులు తెచ్చానని, పనులు ప్రారంభించే లోపు కాంగ్రెస్ నాయకులు ఫండ్ రాకుండా అడ్డుకున్నారని పల్లా తెలిపారు. అయినప్పటికీ జనరల్, ఎల్ఆర్ఎస్ ఫండ్‌లో రూ. 4 కోట్లతో బతుకమ్మ పార్కు సహా మిగిలిన పనులు అభివృద్ధి చేసుకున్నామన్నారు. సోమవారం జనగామ పట్టణ అభివృద్ధి అంశాలపై మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, మాజీ కౌన్సిలర్లతో కలిసి కమిషనర్ ఛాంబర్లో సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ జనగామ మున్సిపాలిటీకి హౌసింగ్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మరో రూ.19.50 కోట్లు వచ్చాయని, వీటితో అన్ని వార్డుల్లో రోడ్లు, మురుగుకాలువలు, పట్టణ ప్రకృతి వనాలు, నెహ్రూ పార్కు నుంచి 60 ఫీట్ల రోడ్డు, రూ. 72 లక్షలతో వైకుంఠథామం మరమ్మతుకు ఖర్చు చేయాల్సి ఉందని, దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నదని అన్నారు.
పట్టణంలో అన్ని వార్డుల్లో లైట్లు వెలగాలని, కాలనీల్లో పారిశుధ్య పనులు జరగాలని, బీఆర్ఎస్ హయాంలో హరితహారం కింద నాటిన చెట్లు ఎండిపోకుండా చూడాలని కోరామని ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు పోకల జమున, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, మాజీ కౌన్సిలర్లు తాళ్ల సురేశ్‌రెడ్డి, బండ పద్మ, స్వరూప, అనిత, సుధ, ముస్త్యాల దయాకర్, సమద్, కమలమ్మ, నాయకులు బండ యాదగిరిరెడ్డి, తిప్పారపు విజయ్, ఉల్లెంగుల దిలీప్, మామిడాల రాజు, నీల యాదగిరి, మసియుద్దీన్, ఉల్లెంగుల నర్సింహ, ఉడుగుల కిష్టయ్య, గజ్జెల నర్సిరెడ్డి, సోమేశ్వర్ తదితరులున్నారు.