హైదరాబాద్, ఆగస్ట్ 1 (నమస్తే తెలంగాణ): రానున్న రోజుల్లో యువత ఆలోచనలే మార్పునకు బాట కాబోతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ‘రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్ఛ’ అనే అంశంపై ఓ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిస్థితులు, సోషల్ మీడియా ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త తరానికి సమాజంపై ఎకువ కమిట్మెంట్ ఉన్నదని, ఢిల్లీలో యువత ఆందోళనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పుడున్న పిల్లలకు దేశంపై ప్రేమ, పట్టింపు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో జెన్ జీ చేపట్టిన ఆందోళనలను మీడియా పట్టించుకోకున్నా నాన్బయాలజిక్ అన్న వారి మెడలను యువత వంచారని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలుగా తాము చేయలేని పనిని దేశ యువతరం చేసి చూపించిందని కొనియాడారు. ప్రభుత్వాలు మీడియా మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుందని అనుకుంటాయని, కానీ మొన్న ప్రధాని అర్ధరాత్రి ఇన్‌స్టాలో వీడియో పెట్టాల్సిన పరిస్థితిని తెచ్చారని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఆందోళన వల్ల కేవలం ప్రభుత్వం మాత్రమే వణకలేదని పాలకపక్షంతో అంటకాగిన మీడియాకూ చెమటలు పట్టాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా దెబ్బకు భజన మీడియా బల్బులు ఎగిరిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో మీడియా స్వేచ్ఛ పూర్తిగా హరిస్తున్నారని, మీడియా సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి తీవ్రంగా ఊగిసలాడాల్సిన పరిస్థితులు వచ్చాయని కేటీఆర్ తెలిపారు.
డిజిటల్ యుగంలో వార్తల వేగం కంటే విశ్వసనీయతే ముఖ్యమని, సోషల్ మీడియా లేకపోతే ప్రభుత్వాల్లో ఎలాంటి చలనం వచ్చేది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని (ఫేక్ న్యూస్) ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకు నిజాలు చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఒక రీట్వీట్ చేసినందుకు నల్ల బాలు అనే వ్యక్తిని 15 రోజులు జైల్లో పెట్టారని కేటీఆర్ గుర్తుచేశారు. లగచర్ల దాడిలో రైతులపై కేసులు పెడితే ఏ మీడియా రాయలేదని ఆయన మండిపడ్డారు.
సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంటుందని తెలిపారు. ఫేక్ న్యూస్ కొందరి తలరాతలు మారుస్తుందని, ఈ విషయంలో అందరం బాధితులమేనని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కొందరు పనిగట్టుకొని తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రగతి భవన్లో 152 బెడ్రూమ్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు అందులో ఉంటున్న మంత్రులే ఎన్ని రూమ్‌లు ఉన్నాయో తెలుపాలని కోరారు. అలాగే రూ.84 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల ఆవినీతి జరిగిందని చిత్రీకరించారని, సినిమా ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు గుప్పించారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రధాన మీడియా అంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయి వ్యాపార ధోరణిలో నడుస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మీడియా పనిచేయాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ శ్రీరాముడు, అయోధ్య రామాలయం అంశాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ విజేతలని పేర్కొన్నారు. ఎవరైనా సరే భావ ప్రకటనా స్వేచ్ఛను, కమ్యూనిస్టు భావ జాలాన్ని అణచివేయడం సాధ్యం కాదని తెలిపారు. ప్రభుత్వాలు పత్రికలపై ఎన్ని ఆంక్షలు విధించినా, వామపక్ష పత్రికలు ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి నిరంతరం పోరాడుతున్నాయని తెలిపారు.
పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, కొన్ని కార్పొరేట్ మీడియా సంస్థలు వాస్తవాలను వక్రీకరిస్తూ వార్తలు ప్రసారం చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించడం మాత్రమే ప్రజాస్వామ్యం కాదని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన సాగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉం టుందని చెప్పారు. అధికారంలోకి రావడానికి పాలక పార్టీలు అన్ని మార్గాలను ఉపయోగిస్తున్నాయని, ప్రజల భాగస్వామ్యం లేని పరిపాలనను ప్రజాస్వామ్యంగా చెప్పలేమమని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ ను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. అసమానతలు తొలగి సమానత్వం సిద్ధించేలా పత్రికలు ప్రజల గొంతుకగా నిలువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎడిటర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మొదట భాష మార్చుకోవాల్సింది సీఎం రేవంత్‌రెడ్డినేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఒక పక రాజకీయ నేతల హేట్ స్పీచ్‌పై శాసనసభలో చర్చ జరుగుతున్న వేళ ఇదే అంశంపై కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మధ్య సంభాషణ ఆసక్తికరంగా సాగింది. మొదట మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యమనాయకుడిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే తమకు అపార గౌరవమని, ఐతే అసెంబ్లీ సమావేశాలకు హాజరై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌లో ఎవరు తప్పు చేసినా తమ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతామని, అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనమని చమతరించారు.
దీనికి కేటీఆర్ స్పందిస్తూ తాము ముందు మర్యాదగానే ఉన్నామని, ముఖ్యమంత్రే పదేపదే తమపై ఆసభ్యకర వాఖ్యలు చేశారని పేర్కొన్నారు. తాను, సీఎం, పీసీసీ అధ్యక్షుడు తమిళనాడులో సమావేశానికి వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి చేసిన తీర్మానాలకు మద్దతు పలికామని గుర్తుచేశారు. రాష్ట్రంలో తమ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా పొరుగు రాష్ట్రానికి వెళ్లినప్పడు రేవంత్‌రెడ్డి తమ సీఎం అని, ఆ స్థానానికి అకడ గౌరవం ఇవ్వకుంటే పలుచనైపోతారనే ఉద్దేశంతో విలువ ఇచ్చామని తెలిపారు. సీఎం వైపు నుంచి ఈ హేట్ స్చీచ్ ఆపాలని, ఇందుకు మహేశ్‌గౌడ్ బాధ్యత వహించాలని కోరారు.