మహబూబ్‌నగర్ అర్బన్ /పాలమూరు, ఆగస్టు 1 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన ఉద్యమకారుడు, ప్రజా నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతిపై అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, ప్రవాస భారతీయులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపై చేరిన ప్రజాప్రతినిధులు సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, మౌనం పాటించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అమెరికా తెలుగు అసోసియేస్(ఆటా)19వ మహసభలో పాల్గొనేందుకు అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరానికి వెళ్లిన తెలంగాణ కు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నాతో కలిసి ఎన్నో పోరాటాలు చేసిన ఆత్మీయ సహచరుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమన్నారు. ఉద్యమం కోసం వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన అరుదైన వ్యక్తిగతం సుదర్శన్‌రెడ్డి, ఆయనలేని లోటు తెలంగాణ సమాజానికి ఎప్పటికి తీరనిదని భావోద్వేగంతో పేర్కొన్నారు.
అనంతరం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి అందించిన సేవలు మరువలేనివని, ఉద్యమ కాలంలో ఆయన చూపిన నిబద్ధత, ప్రజలపై ఆయనకు ఉన్న అంకితభావం యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయన్నారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుల చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. అనంతరం తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ సుదర్శన్‌రెడ్డి మరణం తెలంగాణ ఉద్యమానికి తీరనిలోటని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేసే నాయకులు చాలా అరుదని, అలాంటి అరుదైన నాయకత్వం కలిగిన వ్యక్తిని తెలంగాణ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను భావితరాలు కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం ఎన్నో త్యాగాలు చేసి, ఉద్యమానికి అంకితభావంతో పనిచేసిన నిబద్ధత కలిగిన నాయకుడిగా ఆయనను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు కర్ణె ప్రభాకర్, ప్రముఖ గాయకుడు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ప్రవాస భారతీయ ప్రముఖులు మహేశ్, గుండా అమర్నాథ్, భాను ఇల్లెందుల తదితరులు పాల్గొన్నారు.