సుబేదారి, నవంబర్ 24 : వరంగల్ నగరంలో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతున్నది. దీంతో ట్రాఫిక్ సమస్య వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో దీన్ని ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సిన ట్రాఫిక్ అధికారులు సిబ్బందిని ఇతర పనులు చేయాలని హుకుం జారీ చేయమనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు ముందు నుంచే హనుమకొండ, కాజీపేట, వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బంది, సివిల్, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్‌ను ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్ల వద్ద లైటింగ్, గుంతలు ఉన్న రోడ్ల వద్ద సిమెంట్ ప్యాచ్ వర్కులు, డివైడర్లకు కలరింగ్ పనులు చేయాలని ఆదేశించారు. దీంతో కొద్ది రోజుల నుంచి సిబ్బంది ఈ పనులన్నీ చేస్తున్నారు. డ్రెస్‌కోడ్‌లో డ్యూటీ చేస్తూనే ఈ పనులు కూడా చేస్తున్నామని, ఇది అవమానంగా ఉందని సిబ్బం ది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులన్నీ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి చేయాల్సి ఉండగా, ట్రాఫిక్ సిబ్బందితో చేయించడం విమర్శలకు తావిస్తున్నది.