న్యూశాయంపేట, సెప్టెంబర్ 29 : పర్యాటక హబ్‌గా ఓరుగల్లును తీర్చిదిద్దుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం భద్రకాళీ బండ్ వద్ద చెరువులో బోటింగ్‌ను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ మామిండ్ల రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భద్రకాళీ బండ్ వద్ద రూ.40లక్షలతో బోటింగ్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. నగరవాసుల మానసిక ఉల్లాసానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ.75 కోట్లతో భద్రకాళీ బండ్ అభివృద్ధి, రూ.30 కోట్లతో భద్రకాళీ ఆలయం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పద్మాక్షి జైన్ టెంపుల్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామన్నారు. అగ్గలయ్య గుట్టను సైతం అభివృద్ధి చేస్తామన్నారు. సరిగమ పార్, పబ్లిక్ గార్డెన్, ఏకశిలా పార్, అన్ని డివిజన్లలో పారులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
హనుమకొండ నగరాన్ని ఇప్పటికే కల్చరల్ హబ్‌గా, స్పిరిచువల్ హబ్‌గా ఎడ్యుకేషనల్ హబ్‌గా మెడికల్ హబ్‌గా, ఐటీ హబ్‌గా మార్చామన్నారు. రానున్న రోజుల్లో టూరిజం హబ్‌గా సైతం మారుస్తామన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళీ ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు. పర్యాటకంలో నగరాన్ని ముందు వరుసలో ఉంచుతామన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకే భద్రకాళీ బండ్ వద్ద బోటింగ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రకాళీ చెరువు మధ్యలో ఉన్న బండపై ప్రత్యేక విగ్రహంతోపాటు ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులను కోరారు. తెలంగాణ వచ్చాకే పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలుపుతుందన్నారన్నారు.
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. హనుమకొండ నగరంలో శిల్పారామం ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. వేయిస్తంభాల దేవాలయంలో సౌండ్ అండ్ లైటింగ్ షో ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రత్యేక తెలంగాణ రావడం వల్లే నగరం అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం వరదల సమయంలో సేవలందించిన పర్యాటక సిబ్బందిని అతిథులు అభినందించారు. అలాగే, పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ అధికారి శివాజీ, అధికారులు సూర్యకిరణ్, లోకేశ్, రవియాదవ్, వంశీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.