నెల్లికుదురు, జనవరి 3 : దేశంలో ఎక్కడి నుంచైనా సరే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(యూడైస్) ప్లస్ సైట్లో స్కూల్ డైస్ కోడ్ కొట్టి ఆ స్కూల్ సంక్షిప్త సమాచారం తెలుసుకోచ్చు. ఇది స్కూల్ సంక్షిప్త సమాచారానికి కేరాఫ్ అని చెప్పవచ్చు. యూడైస్ ప్లస్‌లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఆ పాఠశాలలకు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతాయి. డైస్లో పాఠశాలల సమాచారం ఆన్లైన్ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలో కొనసాగుతోంది. ఈమేరకు జిల్లాస్థాయి కో-ఆర్డినేటర్లకు రాష్ట్రస్థాయిలో, మండల కో-ఆర్డినేటర్లకు జిల్లాస్థాయిలో, ఉపాధ్యాయులకు మండల స్థాయిలో అవగాహన సదస్సులు పూర్తయ్యాయి.
ఒక పాఠశాలలో ఎంతమంది విద్యార్థులున్నారు? ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు? పాఠశాలలో ఉన్న మౌలిక సౌకర్యాలేమిటి? ఇంకా ఏమైనా కల్పించాల్సి ఉందా ? విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ అమలుచేసే కార్యక్రమాలు, తదితర అన్ని అంశాలపై విద్యాశాఖకు ఉపయోగపడేది యూ డైస్ప్లస్. ఏటా పాఠశాలల్లోని సౌకర్యాలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారాన్ని ఈ సైట్లో ఆన్లైన్ చేస్తుంటారు. దాని ఆధారంగానే విద్యార్థులకు, పాఠశాలలకు,ఉపాధ్యాయులకు ప్రభుత్వం సౌకర్యాలను కల్పిస్తుంది. విద్యాశాఖకు కేటాయించాల్సిన బడ్జెట్‌కు కూడా ఇదే ప్రామాణికమవుతుంది. యూడైస్ ఆన్లైన్ ప్రక్రియపై జిల్లా స్థాయి కో-ఆర్టినేటర్లకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లెవల్లో మండల స్థాయి కో-ఆర్డినేటర్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు, సీఆర్పీలకు శిక్షణ ఇవ్వగా మండల స్థాయిలో మండల కో-ఆర్డినేటర్లు ఉపాధ్యాయులకు యూడైస్ ప్లస్‌పై అవగాహన కల్పించారు.
యూడైస్ ప్లస్ సమాచారం అన్నింటికి ఆధారం. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌లు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, రాగిజావ తదితర వాటన్నింటికీ ఈ యూడైస్ ప్లస్ సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సమాచారం ఆధారంగానే పాఠశాలల్లో మౌలిక వసతులకు బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయి. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, వాటిలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వివరాలు సైతం ఈ సమాచారం ఆధారంగానే తీసుకుంటారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, జిల్లా కో-ఆర్డినేటర్లు పర్యవేక్షణ చేసి పరిశిలించారు.
యూడైస్‌ప్లస్ జీవోవీ.ఇన్(స్పేస్ లేకుండా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి)
లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్‌పై క్లిక్ చేయాలి.
ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ, టీచర్ మాడ్యూల్, స్కూడెంట్ మాడ్యూల్లను స్కూల్ డైస్ కోడ్, పాస్‌వర్డులతో లాగిన్ అయి అప్డేట్ చేయాలి.
ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్లో స్కూల్‌కు సంబంధించిన సమాచారం అంత అప్లోడ్ చేయాలి.
టీచర్ మాడ్యూల్లో ఉపాధ్యాయుల సమాచారాన్ని అప్లోడ్ చేయాలి.
స్టూడెంట్ మాడ్యూల్లో విద్యార్థుల సమాచారం మొత్తం అప్లోడ్ చేయాలి.
ఆ తర్వాత ఆన్లైన్లో ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీని డౌన్లోడ్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎం సంతకం చేసి, స్టాంప్ వేసి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎమ్మార్సీ కార్యాలయానికి చేరుతాయి.
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు యూడైస్ ప్లస్ ఆన్లైన్లో పొందుపర్చిన సమాచారాన్ని జిల్లా కో-ఆర్డినేటర్లు షెడ్యూల్ ప్రకారం పర్యవేక్షించి పరిశీలించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 5013 పాఠశాలల్లో 5,56757 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలవారీగా యూడైస్ ప్లస్ ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతోంది. మహబూబాబాద్ జిల్లాలో 1215 పాఠశాలల్లో ప్రొఫైల్ ఫెసిలిటీని వంద శాతం పూర్తిచేయగా 100176 మంది విద్యార్థుల అప్డేషన్ 99 23శాతం పూర్తయింది. వరంగల్ జిల్లాలో 1059 పాఠశాలల్లో 122192 మంది విద్యార్థుల అప్డేషన్తో 97.32 శాతం పూర్తయింది. జనగామలో 666 పాఠశాలలకు గాను 665 స్కూళ్లలో ప్రొఫైల్ ఫెసిలిటీ పూర్తికాగా 76652 మంది విద్యార్థుల అప్డేషన్తో 99.69 శాతం పూర్తయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 543 పాఠశాలకు గాను 542 పాఠశాలలు ప్రొఫైల్ ఫెసిలిటీని 99.82 శాతం పూర్తి చేయగా 44995 మంది విద్యార్థుల అప్డేషన్తో 99.79 శాతం పూర్తయింది. ములుగు జిల్లాలో 565 పాఠశాల్లో వంద ప్రొఫైల్ ఫెసిలిటీని చేయగా 42943 మంది విద్యార్థుల అప్డేషన్తో 99.80 శాతం పూరైంది. హనుమకొండ జిల్లాలో 965 పాఠశాలకు గాను 964 పాఠశాలలు ప్రొఫైల్ ఫెసిలిటీని 99.90 శాతం పూర్తి చేయగా 164399 మంది విద్యార్థుల అప్డేషన్తో 99.85 శాతం పూర్తయింది.