మహబూబాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ) : పండుగ పూట ఉల్లి ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మూడు నెలల క్రితం వరకు రూ.20కి కిలో లభించిన ఉల్లిగడ్డల ధరలు అమాం తం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు రూ.70కి చేరడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తినలేని పరిస్థితి నెలకొన్నది. ఇందులో సైజును బట్టి రేటు ఉన్నది. చిన్న సైజు అయితే రూ.55, మీడి యం అయితే రూ.65, పెద్ద గడ్డ అయితే రూ. 70కి కిలో చొ ప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు.
కూరగాయలు, వంట నూనెలు, అల్లం వెల్లుల్లి ధరలు పెరిగి ఓ వైపు ప్రజలు ఇబ్బంది పడుతుండగా, ఇప్పుడు ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కొందరు వాటిని కొనడమే మానేశారు. మరికొందరు వాటిపై పెట్టే ఖర్చును సగానికి తగ్గించుకుంటున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఉల్లిగడ్డ మహారాష్ట్ర నుంచి ఎకువగా దిగుమ తి అవుతుంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట బాగా దెబ్బతిన్నది. దీంతో జిల్లాకు ఉల్లి దిగుమతి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.
ఉల్లిగడ్డల ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సబ్సిడీపై అందించేంది. కానీ, ప్రస్తుతం ప్రభు త్వం ఆ ప్రయత్నాలు చేయడం లేదు. బహిరంగ మార్కెట్లో రోజురోజుకూ పెరుగుతున్న ఉల్లిగడ్డల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఉల్లి ధరలు ఆకాశాన్నంటినా కాంగ్రెస్ ప్రభుత్వం సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.