దుగ్గొండి, మే, 07: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన జరుగుతుందని దుగ్గొండి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏలగొండ రామస్వామి పేర్కొన్నారు. బుధవారం మండలంలో పలు గ్రామాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యను అభ్యసించాలని వారి తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందని, ఉచిత పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, అటల్ టింకరింగ్, ల్యాబ్ అత్యాధునికమైన సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలు చేయడం ద్వారా విద్యార్థులకు ప్రత్యక్ష సూక్ష్మ పరిశీలన జ్ఞానం పెరుగుతుందని, ఆటల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. వేలకు వేల ఫీజులు కట్టి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే బదులు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించాలని తల్లిదండ్రులను, విద్యార్థులను కోరారు.