భీమదేవరపల్లి, మార్చి 11 : వ్యవసాయ బావిలో పూడిక తీసేందుకు క్రేన్ డబ్బాలో దిగుతుండగా గేర్ వైరు తెగి ఓ వ్యక్తి బావిలో పడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముల్కనూరులో సోమవారం జరిగింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రెడ్డి కుమారస్వామి (53) ఐదేళ్లుగా అతడి అత్తవాళ్ల గ్రామం ముల్కనూరులో క్రేన్ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామానికి చెందిన మారుపాక రాజమొగిలి వ్యవసాయ బావిలో నీళ్లు అడుగంటాయి. దీంతో పూడికతీత తీయాలని రెడ్డి కుమారస్వామిని కోరాడు. ఎనిమిది రోజులుగా కుమారస్వామి కూలీల సహాయంతో పూడికతీత పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో కూలీలు కూన యాదగిరి, అలుగు వెంకటేశ్, మారుపాక రమేశ్, అలుగు మణెమ్మ పూడికతీత పనులకు వెళ్లారు. మొదట వెంకటేశ్, రమేశ్ క్రేన్ సహాయంతో డబ్బా ద్వారా బావిలోకి దిగారు.
అనంతరం క్రేన్ నడుపుతున్న రెడ్డి కుమారస్వామి అతడి భార్య రమాదేవికి చెప్పి బావిలోకి దిగేందుకు క్రేన్ డబ్బా ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ గేరు వైరు ఊడిపోయింది. దీంతో డబ్బాతో సహా కుమారస్వామి బావిలో పడ్డాడు. బండపై పడడంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్లముందే కట్టుకున్న భర్త విగతజీవిగా పడి ఉండడంతో రమాదేవి రోదనలు మిన్నంటాయి. కుమారస్వామికి కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నండ్రు సాయిబాబు తెలిపారు.