తొర్రూరు, జూలై 2 : తొర్రూరు ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మండలంలోని గోపాలగిరి గ్రామం వద్ద ఆయిల్‌పాం పరిశ్రమకు ఈ నెల 14న శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆయన కలిసి దీనిపై చర్చించారు.
ఆయిల్‌పాం ఫ్యాక్టరీ శంకుస్థాపనతో పాటు అదే రోజు హరిపిరాల వద నిర్మించిన మహబూబాబాద్ జిల్లా ఆయిల్‌ఫెడ్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇప్పటికే రైతుకు అనేక రాయితీలు కల్పిస్తూ ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం జిల్లాలో సాగు విస్తీర్ణం పెంచే దిశగా నిరంతర చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో గోపాలగిరిలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ స్థాపనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 14న నిర్వహించే ఫ్యాక్టరీ శంకుస్థాపన, కార్యాలయం ప్రారంభోత్సవాలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యేలా తగిన ఏర్పాట్లు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఫ్యాక్టరీ శంకుస్థాపన వేదిక వద్దే ఆయిల్‌పాం సాగు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు చెప్పారు. మంత్రిని కలిసి వారిలో ఆయిల్‌ఫెడ్ ఎండీ సురేందర్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.