నర్సింహులపేట, నవంబర్ 8 : భారీ వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీస్తే.. ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం తడిసిందనే సాకుతో అగ్గువ సగ్గువకు కొంటూ నిండా ముంచుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయిద్దామనుకున్న అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అధికారులు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దీనిని ప్రైవేట్ వ్యాపారులు ఆసరాగా తీసుకుంటున్నారు. మద్దతు ధరకంటే తక్కువకు అడుగుతున్నా విక్రయించాల్సిన దుస్థితి రైతులకు ఏర్పడింది.
సన్న ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చే విషయమై రైతులకు అవగాహన కల్పించకపోవడం, యాసంగిలో విక్రయించిన సన్నాలకు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వకపోవడంతో వచ్చిందే చాలనుకొని రైతులు తమ కల్లాల్లోనే వడ్లను విక్రయిస్తున్నారు. సన్న ధాన్యం రకాన్ని బట్టి పచ్చివి రూ.1,800 నుంచి రూ. 2,200కు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో వాటిని ఆరబెట్టలేక అమ్ముకుంటున్నారు.