పోచమ్మమైదాన్, డిసెంబర్ 22 : తూనికల కొలతల (లీగల్ మెట్రాలజీ) విభాగంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని చెబుతున్న అధికారులు ఉన్న వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ రీజియన్ డిప్యూటీ కంట్రోలర్ పరిధిలోని పలు జిల్లాల్లో కొంతమంది లీగల్ మెట్రాలజీ ఆఫీసర్లు టెక్నికల్ అసిస్టెంట్లను కావాలనే తమ వెంట తీసుకెళ్లడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లీగల్ మెట్రాలజీ తనిఖీలకు వెళ్లినప్పుడు తప్పక ఉండాల్సిన వీరిని కార్యాలయానికే పరిమితం చేస్తున్నట్లు తెలుస్తున్నది. వరంగల్లోని డిప్యూటీ కంట్రోలర్ కార్యాలయం పరిధిలో వరంగల్, ఖమ్మం, కరీమాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలకు ఉన్నతాధికారిగా డిప్యూటీ కంట్రోలర్ ఉంటూ తనిఖీలు, ఇతర వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తారు. అయితే సదరు అధికారి నల్లగొండ, వరంగల్ జిల్లాలకు ఇన్చార్జిగా ఉంటూ మూడు రోజులు అక్కడ, మిగిలిన రోజులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తుంటారు. దీంతో శాఖపై ఆయన అజమాయిషీ లేకపోవడంతో కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వరంగల్ రీజియన్ పరిధిలో హనుమకొండ, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల, కాగజ్నగర్, ఖమ్మం, మధిర, భద్రాద్రి కొత్తగూడెం లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తుండగా, వరంగల్, పెద్దపల్లి, భద్రాచలంలో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, వ్యాపార వాణిజ్య సంస్థల్లో తనిఖీలు, స్టాంపింగ్ కోసం వెళ్లినప్పుడు కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లు విధుల్లో ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు తమ డ్రైవర్లు, అటెండర్లను తీసుకెళ్తున్నారు. వీరే వ్యాపారుల బాట్లు సరిచేయడం, వేయింగ్ మిషన్లను పరిశీలించడం చేసిన అనంతరం సంబంధిత అధికారి స్టాంపింగ్ వేస్తున్నారు. అయితే, లీగల్ మెట్రాలజీలో శిక్షణ పొందిన టెక్నికల్ అసిస్టెంట్ల సేవలు ఉపయోగించుకోకుండా వారిని ఆఫీసుకే పరిమితం చేయడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా వ్యాపారుల వద్ద వసూలు చేసిన డబ్బుల్లో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఉన్నతాధికారికి తెలిసినా తనకు కూడా వాటా వస్తున్నందున పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.
లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీకి వెళ్లినప్పుడు టెక్నికల్ అసిస్టెంట్లను చాలా వరకు తీసుకెళ్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇన్చార్జి అధికారులున్నప్పుడు వారిని తీసుకవెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దూర ప్రాంతానికి వెళ్లినప్పుడు టెక్నికల్ అసిస్టెంట్లు సొంత జిల్లాకు రావడం సమస్యగా మారుతుంది. దీంతో ఎదురయ్యే ఇక్కట్లతోనే కొందరు అధికారులు వారిని తీసుకెళ్లడం లేదు. అలాగే మహిళా టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నచోట వారు రావడానికి సుముఖత చూపడం లేదు.