మహదేవపూర్ (కాళేశ్వరం), మే 9 : సరస్వతీ పుష్కరా లు పూర్తయ్యే వరకూ అన్ని శాఖల అధికారులు కాళేశ్వరంలోనే మకాం వేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ముక్తీశ్వర ఏమిటీ నిర్లక్ష్యం’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. దీనికి స్పందించిన కలెక్టర్ పుష్కరాల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలయ ఈవో కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆరోగ్య శిబిరాల ఏర్పాట్లు, సాంసృతిక కా ర్యక్రమాలకు అవసరమైన స్టేజి, మైక్ ఇతర ఏర్పాట్లు, పారిశుధ్య పనులు, సిబ్బందికి ఆహార ఏర్పాట్లపై పర్యవేక్షణకు విధులు కేటాయించిన అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. అత్యవసర వైద్య కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.
పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అత్యవసర మందులు, ఓఆర్ఎస్ పాకెట్స్ అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు మహాదేవపూర్‌లో 30 బెడ్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అనంతరం వీవీఐపీ ఘాట్ గోదావరిలో నీటిమట్టం, టెంట్ సిటిని పరిశీలించారు. టెంట్ సిటీ వద్ద వర్షం వచ్చినా బురద కాకుండా గ్రావెల్ వేయాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, డీపీవో వీరభద్రయ్య, ఈవో మహేశ్, డీఎంహెచ్‌వో మధుసూదన్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రహ్లాద్రాథోడ్, డీటీ కృష్ణ, మెడికల్ ఆఫీసర్ సుస్మిత, ఆర్అండ్బీ, పీఆర్ ఇంజినీరింగ్, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.