వరంగల్, జనవరి 7: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 18 నుంచి చేపట్టనున్న రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో వింగ్ అధికారులతో శనివారం ఆమె కంటి వెలుగు శిబిరాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి వంద రోజుల పని దినాలు కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లలో ప్రజలకు సౌకర్యవంతమైన కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రేటర్ పరిధిలో నోడల్ అధికారిగా ఉన్న అదనపు కమిషనర్ రవీందర్యాదవ్ ఎప్పటికప్పుడు హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావుతో సమన్వయం చేసుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ప్రతి కేంద్రానికి నోడల్ అధికారులను నియమించామన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. షామియానాలు, తాగునీటి వసతి, టాయ్లెట్లు, లైటింగ్, ఫర్నిచర్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల అధికారులు సమకూర్చాలని ఆదేశించారు. కంటివెలుగు కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ప్రచార మాధ్యమాలు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యుల సేవలు వినియోగించుకోవాలన్నారు. సమీక్షలో అదనపు కమిషనర్ రవీందర్యాదవ్, ఎస్ఈ కృష్ణారావు, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, కార్యదర్శి విజయలక్ష్మి, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.