చెన్నారావుపేట : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అడ్మిషన్ కోసం ఆదివారం జరిగిన సాధారణ ఎంట్రెన్స్ ఎగ్జామ్(Gurukul entrance exam) రాయకుండా ఓ బాలికను ఆపిన ఘటన చెన్నారావుపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నారావుపేట మండలం గొల్లభామ తండా గ్రామపంచాయతీ అడ్డబాట తండాకు చెందిన బోడ దివ్యశ్రీ అనే బాలిక ఆరవ తరగతిలో ప్రవేశం పొందుటకు పరీక్షకు హాజరైంది. అధికారులు పరీక్ష సెంటర్లోకి వెళ్లకుండా ఆపారు. దీంతో అయోమయానికి గురైన బాలిక తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశారు.
సదరు బాలిక తల్లిదండ్రుల సంపాదన రెండు లక్షల పైన ఉన్నట్టు రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారని, అందు కారణంగా బాలిక ను పరీక్షకు హాజరుకాకుండా ఆపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల అందినట్లు వారు తెలిపారు. దీనిపై సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హెచ్ఎం జయలక్ష్మిని వివరణ కోరగా ఉన్నత అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పలు కారణాలతో ఐదుగురు విద్యార్థులను పరీక్ష రాయకుండా ఆపినట్లు వారు తెలిపారు. అందులో దివ్యశ్రీ అనే బాలిక ఒకరిని చెప్పారు. దివ్యశ్రీ తల్లిదండ్రులు రోజువారి వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
అలాంటి వారికి రెండు లక్షల సంపాదన ఉందని రెవెన్యూ అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదిక కారణంగానే తమ పాప పరీక్ష రాయకుండా ఆగిందని, వాళ్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలలో చేర్పించి తమ చిన్నారిని చదివిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశపడిన ఆ తల్లిదండ్రులు పరీక్ష రాయకుండా అధికారులు ఆపడంతో తీవ్ర నిరాశకు గురైనట్లు తెలిపారు. అధికారుల తప్పిదానికి తమ చిన్నారి పరీక్ష రాయకుండా ఆగిందని, దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. తప్పు ఎవరో చేస్తే చిన్నారిని పరీక్ష రాయకుండా ఆపి శిక్ష విధిస్తరా? అని పరీక్ష కేంద్రం వద్ద ఉన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నిలదీశారు.