మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : మేడారం జాతరకు వెళ్లే భక్తులకు అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం(బెల్లం) కొనుగోళ్లకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో భక్తులు ఇబ్బందిపడుతున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరలో భక్తులు పెద్ద ఎత్తున బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవార్లు సమ్మక్క, సారలమ్మకు సమర్పిస్తారు. ఏటా వేలాది క్వింటాళ్ల బంగారాన్ని మొక్కుగా చెల్లిస్తారు. అయితే, గతంలో ఈ బెల్లాన్ని అక్రమారులు కొనుగోలు చేసి గుడుంబా తయారీకి వినియోగించేవారని, అధికారులు అమ్మకాలపై నిఘా పెట్టేవారు. ఈ ఏడాది ఏకంగా బెల్లం కొనుగోళ్లకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. బంగారం కొనుగోలు చేసే ప్రతి ఒకరి ఆధార్ కార్డు జిరాక్స్‌తోపాటు ఫోన్ నంబర్ సేకరించి తమకు అందజేయాలని వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వనిదే బంగారం విక్రయించేది లేదని తేల్చిచెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు మేడారంలో కూడా ఆధార్ కార్డు ఉంటేనే భక్తులకు బంగారాన్ని వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కొత్తగా నిబంధనలు విధించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలతోపాటు మేడారంలో బెల్లం విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ నేపథ్యంలో బెల్లం పకదారి పట్టకుండా ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్న చర్యలు భక్తులకు ఇబ్బందిగా మారాయి. మేడారం వెళ్లే భక్తులు ప్రతి ఒకరూ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ వెంట తీసుకెళ్లడం సాధ్యంకాదు. ఇప్పటికైనా అధికారులు ఈ కొత్త నిబంధనను సడలించాలని అటు వ్యాపారులు ఇటు భక్తులు కోరుతున్నారు.
ములుగు రూరల్, ఫిబ్రవరి 4 : మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు సమర్పించే ఎత్తు బంగారంపై ఆధార్ కార్డు జిరాక్స్‌లు సమర్పించాలనే నిబంధనను ఎత్తివేయాలని ములుగు జిల్లా సామాజికవేత్త సుతారి సతీశ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బెల్లం పక్కదారి పట్టకుండా కొనుగోలుదారుల నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశించడం భక్తులను జాతరకు దూరం చేయడమే అవుతుందని ఆరోపించారు. భక్తుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి వారి వ్యక్తిగత జీవితాలకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. ఈ ఆదేశాలు నిలిపివేసి పక్కదారి పట్టే బెల్లంపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఆలోచనలు ప్రభుత్వం మానుకోవాలన్నారు.