ఏటూరునాగారం, జూన్ 12 : గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో అధికారులు తనిఖీలతో హడావిడి చేస్తున్నారు. ముందస్తుగా సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అధికారులు పాఠశాలలు తెరిచిన రోజునే తనిఖీలు చేయడం విమర్శలకు దారితీస్తున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 64 ఆశ్రమ పాఠశాలలు, 30 హాస్టల్స్, 29 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, రెండు జూనియర్ కాలేజీలుండగా, ఇందులో హనుమకొండ జిల్లాలో 12, జనగామలో10, జయశంకర్ భూపాలపల్ల్లిలో 13, మహబూబాబాద్‌లో 34, ములుగులో 44, వరంగల్ జిల్లాలో 12 ఉన్నాయి. వీటిలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని వెంటనే పనులు చేపట్టాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్లు, డీటీడీవోలు, ఏటీడీవోలు, ఏసీఎంవోలు, ఐటీడీఏ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ డీఈఈ, ఏఈఈ, జీసీసీ డీఎం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ఐటీడీఏ పీవో నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో బుధవారం సుమారు 30 మంది అధికారులు తనిఖీలు చేపట్టారు.
పాఠశాలల నిండా సమస్యలే..
ఉమ్మడి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలు, హాస్టల్స్‌లో వాటర్ లీకేజీ, తాగునీటి ఇబ్బందులు, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయడం, కిచెన్ షెడ్లు, ట్యూబ్‌లైట్లు, సోలార్ ల్యాంప్‌లు, ఫ్యాన్లు, బెడ్లు, ఫ్లోరింగ్, కిటికీలు, త లుపులు, స్నానపు గదులకు నీటి సరఫరా, మురు గు నీటికాల్వలు, సోలార్ వాటర్ హీటర్స్ పనితీరు, బోర్లు తదితర సమస్యలు నెలకొన్నాయి.
విద్యార్థులు బడి బాట పట్టే సమయంలో అధికారులు సమస్యలను గుర్తించి తక్షణం పరిష్కరించాలన్న ఆదేశాలతో ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు అయోమయానికి గురవుతున్నారు. దీనికి తోడు అనేక పాఠశాలలు, హాస్టల్స్‌లో నిత్యావసర సరుకులు నిండు కున్నాయి. కూరగాయలు, అరటి పం డ్లు, మటన్, చికెన్, కోడిగుడ్ల సరఫరాకు ముందుగానే టెండర్లు నిర్వహిస్తారు.
ఏటూరునాగారం మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలో నిత్యావసర సరుకులు లేవని తనిఖీకి వచ్చిన ప్రత్యేకాధికారి, ఐటీడీఏ ఏవో దామోదర్స్వామికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మనోజ్‌కుమార్ తెలిపారు. ఇంత వరకు పాఠశాలకు జీసీసీ ద్వారా సరఫరా కాలేదనడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.