తొర్రూరు, డిసెంబర్2: గురుకులాల గేట్లకు తాళాలు వెక్కిరించాయి. సోమవారం తొర్రూరులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కేజీబీవీల్లో వసతుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్, విద్యార్థి సంఘం నాయకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో గేట్ల ఎదుటే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఆశ్రమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 48 మంది విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, కళాశాలలపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని మండిపడ్డారు.
పేద విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన ప్రతినిధి బృందాన్ని అడ్డుకుంటారా?, ఉన్న తాధికారుల అనుమతి లేనిదే లోపలికి రానివ్వమనడం వారికి విద్యార్థులపై ఉన్న అశ్రద్ధకు నిదర్శ నమన్నారు. హాస్టళ్ల పరిశీలనకు వెళ్తే గేట్లకు తాళం వేసుకొన్న తీరు రేవంత్ రెడ్డి సరారు నిరంకుశత్వ పాలనకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రాజేశ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాస రావు, మండల పరిషత్ కో ఆప్షన్ మాజీ సభ్యుడు ఎస్కే అంకూస్, కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కల్వకొలను జనార్దన్ రాజు, బీఆర్ఎస్ నాయకులు ధరావత్ జై సింగ్, కౌన్సిలర్ గుగులోత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.