వరంగల్, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఇకమీదట రైతులెవరైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే కేసులే. అవి అట్లాంటి.. ఇట్లాంటివి కాదు. ఏకంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రైతులను బెదిరింపులకు గురిచేస్తున్నది. పోలీసులను ఉసిగొలిపి అన్నదాల నోళ్లు మూయించేందుకు వ్యూహరచన చేసిం ది. అందులో భాగమే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్న పరిణామం.
‘ప్రభుత్వం వెంటనే తమ వడ్లు కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేసిన పాపానికి గాలి సడవలి, మానెం రాజబాబు, కొండపర్తి రవి, కొండగొర్ల వెంకటస్వామి, రామిల్ల రాజబాపు, మాడెం రవి, కొండ తిరుపతి, బొమ్మ తిరుపతిరెడ్డిపై రేవంత్ సర్కార్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసింది. ఈ 8 మంది రైతులు ‘రోడ్డుపై వాహనాలను అడ్డగించి, ప్రజాశాంతికి భంగం కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినారు. వారు సుమారు అరగంట వరకు ప్రజా రవాణాను స్తంభింపజేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించినారు’ అని రైతులపై అభియోగం మోపారు.
సోమవారం కాటారం మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా మెయిన్‌రోడ్డుపై రోజుల తరబడి ఎదురుచూస్తున్నా తాము పండించిన పంటను కొనుగోలు చేయడం లేదనే ఆవేదనతో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రజాహక్కుల పరిరక్షణ తమ ప్రజాపాలనలో ఏడో హామీ అని గొప్పగా సెలవిచ్చిన కాంగ్రెస్ దానిని బుట్టదాఖలు చేసింది. ధాన్యం తీసుకొచ్చి ఇప్పటికి దాదాపు 40-45 రోజులైందని, కొనుగోలు చేయడానికి ఇంకో నెలో.. రెండు నెలలో ఎదురుచూడాలి గానీ, అప్పుడే ఓపిక నశించి రోడ్డు ఎక్కితే ఎలా? అని ఠారెత్తిన పోలీసులు రైతులపై కేసులు నమోదు చేశారు.
ఈ చర్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తమ పంటను కొనుగోలు చేయాలని కోరిన పాపానికి రైతులను శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సంఘవిద్రోహశక్తులతో పోల్చి కేసులు పెడతారా? అంటూ రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పంట కొనుగోలు చేయకపోగా అన్నదాతలపై కేసులు చేయడం దారుణమంటున్నారు. రైతులు పండించే పంటను కొనుగోలు చేయలేక అన్నం పెట్టే చేతులకు రేవంత్ సర్కార్ సంకెళ్లు వేసేందుకు సిద్ధమైందనే విషయం కాటారం ఘటనతో తేలిపోయిందని, ఈ నేపథ్యంలో ఇక తాము చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ హెచ్చరిస్తున్నది. రైతులపై నమోదు చేసిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
బెదిరింపు.. ఆ వెంటే భయం
కాంగ్రెస్ సర్కారును భయం వెంటాడుతున్నదని కాటారం ఘటనే నిదర్శనంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కొంతమంది వ్యక్తులు రోడ్డుపై ప్రజారవాణాను అడ్డుకున్నారనే కారణంతోపాటు తమ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అయితే, వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళన చేసింది రైతులు అని పేర్కొనకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో నేరుగా రైతులు అని పేర్కొంటే తమకు రాష్ట్రవ్యాప్తంగా చెడ్డపేరు వస్తుందని జడిసే వారిని రైతులు అని కాకుండా వ్యక్తులు అని పేర్కొన్నారనే వాదన ఒకవైపు వినిపిస్తుండగా మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎవరు వ్యవహరించినా తాము ఇలానే చేస్తామనే హెచ్చరికను ప్రభుత్వం జారీ చేసిందనే వాదనా వినిపిస్తున్నది. ఏ వాదన ఎట్లా ఉన్నా వరంగల్ ఉమ్మడి జిల్లా చరిత్రలో పంట కొనుగోలు చేయమని డిమాండ్ చేసినందుకు ఇలా రైతుల మీద నా న్బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఇదే తొలిసారి అని రైతు సంఘాల నేతలు పేర్కొనడం గమనార్హం.
నెల రోజులుగా ఎదురుచూస్తున్న..
నేను 8 ఎకరాల్లో వరి పంట వేసిన. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొని వచ్చి నెల రోజులైతాంది. ఇప్పటి వరకు కొనుడు లేదు. గొడ్లు, బర్లు, పందుల నుంచి వడ్లను కాపాడుకునేందుకు ఇబ్బంది పడుతున్నం. ఎండనక, వాననక కష్టపడి పంటను పండిస్తే మమ్మల్ని పట్టించుకున్న వారే లేరు. మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నరు. వ్యవసాయం చేసుడే మా తప్పా? దేశానికి వెన్నెముక అయిన రైతులను వెన్నుపూస విరిగ్గొట్టి కొనుగోలు కేంద్రాల వద్ద కూసోబెడుతున్నారు.
– బొమ్మన దామోదర్, రైతు, కాటారం
కనికరం లేని ప్రభుత్వం
ఈ ప్రభుత్వానికి రైతులంటే లెక్కేలేదు. ఎవుసం చేసేటప్పుడు సుతం ఇంత కష్టపడలే. 20 రోజులుగా కల్లాల వద్ద ధాన్యం ఉన్నా ఒక్కరికి కనికరం లేదు. ఏమన్నంటే లారీలు లేవు, ఇప్పు డు.. అప్పుడు అని రోజులు గడుపుతున్నరు. ధాన్యం మీద కప్పేందుకు పరదాలు కూడా ఇవ్వడం లేదు. వడ్లను గొడ్లు బుక్కకుండా కావలి కాయాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. తాగేందుకు నీళ్లు కూడా లేవు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తిప్పలు తీర్చాలి.
– బొమ్మ తిరుపతి, రైతు, కాటారం