ములుగు, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : పశు సంపద పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సంచార పశువైద్య(1962) ఉద్యోగులు వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. నిరంతరం మూగజీవాల సేవకు అంకితమవుతున్న సిబ్బంది 10 నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2017లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంచార పశు వైద్యం కోసం 1962 అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, జనగామ, పరకాల, పాలకుర్తి, నర్సంపేట, వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్ ప్రాంతాలకు తొమ్మిది అంబులెన్స్‌లను కేటాయించింది.
ఇందులో పనిచేసేందుకు ఒక పశు వైద్య నిపుణుడు, ఒక ప్యారావెట్, హెల్పర్, కెప్టెన్‌ను నియమించింది. ఒక్కో అంబులెన్స్‌లో వీరంతా 1962 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ రాగానే గ్రామాల్లో పర్యటిస్తూ పశువులకు వైద్య సేవలందిస్తున్నారు. పశువైద్యులకు రూ.35వేలు, ప్యారావెట్కు రూ.14వేలు, కెప్టెన్‌కు రూ.8,500, హెల్పర్‌కు రూ.7,500 చొప్పున ప్రతినెలా జీవీకే సంస్థ ద్వారా వేతనాలందిస్తున్నారు. దీంతో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి. ఫలితంగా గ్రామాల్లో పశు మరణాలు తగ్గుముఖం పట్టడంతో పాటు రైతులు, పశు యజమానులకు మేలు చేకూరినట్లయ్యింది.