జనగామ, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : మృగశిర వెళ్లిపోయి ఆరుద్ర కార్తె వచ్చి వారంపైగా అవుతున్నా వాన జాడ మాత్రం కానరావడంలేదు. ఈ సీజన్లో కళకళలాడాల్సిన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, కాల్వలు, చెక్‌డ్యామ్‌లు వెలవెలబోతున్నాయి. సూపర్ ఎల్‌నినో కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించక నెలకొన్న వర్షాభావ పరిస్థితులు పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉండగా.. ఎగువ ప్రాంతమైన జనగామ జిల్లాలో భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోయాయి. ఈ సీజన్లో వానలు పడతాయా? లేదా? అనే ఆందోళన రైతుల్లో మొదలు కాగా, వానకాలం పంటల సాగుపై సందిగ్ధత నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో వానకాలంలో 15.80 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా జూన్ ముగింపు నాటికి కేవలం 5 శాతం మాత్రమే సాగులోకొచ్చాయి. ములుగు, భూపాలపల్లి మినహా మిగిలిన జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల పత్తి గింజలు మొలకెత్తిన తర్వాత వర్షాలు లేక ఎండిపోయాయి. రైతులు రెండోసారి విత్తనాలు కొనుగోలు చేసి మళ్లీ నాటాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు సాగునీటి వనరులున్న రైతులు బోర్లు, డ్రిప్, స్ప్రింకర్లతో నానా పాట్లు పడుతుండగా.. వర్షాధారంగా పంటలు వేసేవారు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
జనగామ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 7.37 మీటర్ల లోతులో ఉన్న నీటి జాడలు, మే వచ్చే సరికి 7.78 మీటర్ల లోతుకు చేరాయి. ఇప్పుడు వానకాలం ప్రారంభమై ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతోపాటు జూన్ మొదటి వారం నుంచి పత్తి విత్తడం, వరినార్లు పోయడం, నాట్ల కోసం దున్నకాలు చేపట్టడంతో సాగునీటి వినియోగం పెరిగి భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో ప్రతి పంట సీజన్‌కు ముందే రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందేది. గత రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగవేతలతో రైతులు అప్పులు తెచ్చి దుక్కులు దున్ని, విత్తనాలు, ఎరువులు కొని సాగుకు సన్నద్ధమయ్యారు. అయితే ఈ ఏడాది అదనుదాటుతున్నా వానలు కురవకపోడంతో సిద్ధం చేసుకున్న దుక్కులు వెక్కిరిస్తున్నాయి. నాటేందుకు సిద్ధంగా ఉన్న వరినారు మడులు ముదిరిపోతున్నాయి.
ఈ పరిస్థితుల్లో అన్నదాత వర్షాల కోసం ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నాడు. జనగామ జిల్లా సహా మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు. జూన్‌లో అంతంత మాత్రంగా కురిసిన వానలకు కొందరు రైతులు పత్తి, మొక్కజొన్న వేసినా.. ఆ తర్వాత వరుణుడు మొహం చాటేయడంతో మొలకెత్తిన పంటలు సైతం ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చి ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకుంటున్నా.. సాయంత్రానికి తేలిపోతున్నాయి. వేసవి ఎండలను తలపించేలా భానుడు భగభగ మండిపోతున్నాడు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిండు వేసవిలోనూ దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు గోదావరి జలాలను తరలించిన ఫలితంగా వర్షాభావం నెలకొన్నా భూగర్భ జలాలు సమృద్ధిగా లభించి వానకాలం, యాసంగి సాగుకు ఢోకాలేకుండా ఉండేది.
కానీ రెండున్నరేండ్ల రేవంత్‌రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై మొసలి కన్నీరు కారుస్తూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను రైతు పొలాలకు తరలించకపోగా, దేవాదుల నీటి విడుదలను సైతం నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండాకాలంలోనూ మత్తళ్లు దూకిన నీటి వనరులన్నీ ఎండిపోయి వెక్కిరిస్తుండగా.. చుక్కనీరు లేక చెక్‌డ్యామ్‌లు వెలవెలబోతున్నాయి.