Banjara | నర్సింహులపేట, మే 28 : అటు జోరుగా వర్షం కురియడంతో.. ఇటు కరెంటు పోయింది. దీంతో రాత్రంతా జాగారమే చేయవలసి వచ్చింది ఆ గ్రామ ప్రజలు. మూడు నెలల క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. కరెంటు సమస్య పరిష్కరించకపోవడంతో ప్రజలు నానాయాతన పడుతున్నారు.
నర్సింహులపేట మండలంలోని నరసింహపురం బంజర గ్రామపంచాయతీలో 150 గృహాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా 100 గృహాలకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు నోచుకోలేదు. కొన్ని నెలలు గడుస్తున్నా అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో మంగళవారం కురిసిన వర్షానికి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో అటు వర్షం, ఇటు చిమ్మ చీకట్లో గ్రామ ప్రజలు ఉండిపోవాల్సి వచ్చింది.
వర్షం కారణంగా పాములు తేళ్లు బయటకు వచ్చే అవకాశం ఉందని, దాంతో బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం గ్రామస్తులు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేయాలని మూడు నెలల క్రితం తొర్రూర్కి వెళ్లి ట్రాన్స్కో డీఈకి వినతి పత్రం ఇచ్చి మా బాధలను వివరించడం జరిగిందన్నారు. అయినా ఇప్పటివరకు మరమ్మతులు చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి చిమ్మ చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేసి ఆన్ ఆఫ్ స్విచ్ ఏర్పాటు చేయాలని గ్రామ వాసులు కోరుతున్నారు.