రైతుల కోరిక మేరకు సర్కారు నిర్ణయం
సీఎస్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి కేటీఆర్ ఆదేశాలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ వెల్లడి
ఔటర్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ను రద్దు చేస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం మంత్రి కేటీఆర్‌ను కలిసి ల్యాండ్ పూలింగ్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియపై తగిన నిర్ణయం అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించగా రాత్రి వరకు ఉత్తర్వులు వెలువడినట్లు పేర్కొన్నారు.
వరంగల్, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. టీఆర్ఎస్ అంటేనే రైతుల పార్టీ అని, రాష్ట్రంలో ఉన్నదని రైతు ప్రభుత్వమని అన్నారు. తెలంగాణలో ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలిగించకూడదనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని చెప్పారు. వారి అభిప్రాయాల మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ సోమవారం మున్సిపల్ మంత్రి కే తారకరామారావును హైదరాబాద్‌లో కలిసి ల్యాండ్ పూలింగ్ అంశంపై చర్చించారు. రైతులు, గ్రామీణ ప్రాంతాల్లోని వారి అభిప్రాయాలను మంత్రి కేటీఆర్‌కు వివరించారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని రద్దు చేయాలని మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజలు, రైతుల అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వ విధానాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్లు చెప్పారు.
భూసమీకరణపై తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ను ఆదేశించారని వివరించారు. వరంగల్ మహానగరం అభివృద్ధికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని, ఈ ప్రక్రియలో రైతులు, ప్రజల అభిప్రాయాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యే అరూరి చెప్పారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియపై కొన్ని రోజులుగా ప్రజలు, రైతుల నుంచి వస్తున్న అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. ల్యాండ్ పూలింగ్ రద్దుపై నిర్ణయం తీసుకున్న మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు.