ములుగు/జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ)/బయ్యారం: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణులకు రక్షణ కరువైంది. ఫలితంగా రోజురోజుకూ అవి కనుమరుగవుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా ఏజెన్సీ గ్రామాల్లో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను వధిస్తున్నారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా వాటి చర్మం, మాంసాన్ని పట్టణ ప్రాంతాలు, శివారుల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా సమాచారం ఇస్తేనే పట్టుకుంటున్నారని, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణకు కఠిన చట్టాలున్నా అవి అమలుకు నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి.
ములుగు మండలంలోని జాకారంలో ఈ నెల 8న అడవి పందితో పాటు మనుపిల్లిని విద్యుత్ తీగలు అమర్చి చంపి కాల్చిన సంఘటన చోటుచేసుకున్నది. సెప్టెంబర్ 18న వెంకటాపూర్ మండలం వెళ్తుర్లపల్లి వద్ద మూడు అడవి పందులను విద్యుత్ తీగలు అమర్చి హతమార్చి కాల్చిన ఘటనతో పాటు ఈ నెల 5న గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి అమర్చిన ఉచ్చులో అడవిపంది పడి తప్పించుకున్నది. దీంతో పాటు ఆగస్టులో భారీ వర్షాల వల్ల వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అటవీ మార్గం గుండా ములుగు మండలం మదనపల్లి శివారులోని లోకం చెరువు వరకు పంట పొలాల్లో చిరుతపులి అడుగులను ఫారెస్టు అధికారులు గుర్తించారు.
అయితే ఈ చిరుతపులి తిరిగి దాని స్థావరానికి వెళ్లింది. ములుగు జిల్లాలో వన్యప్రాణుల వేటతో పాటు ఇతర రాష్ర్టాల మీదుగా అటవీ జంతువుల మాంసం, చర్మం రవాణా సాగుతున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25న ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలో విక్రయించేందుకు ఓ వ్యక్తి బైక్‌పై చిరుతపులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసు, అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. గతంలో సైతం జిల్లాకు వచ్చిన పెద్దపులిని వేటాడి చంపి దాని చర్మం, గోర్లు, మీసాలను విక్రయించేందుకు యత్నించిన వారిని పోలీసులు పట్టుకున్నారు. అధికారులు స్పందించి వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టాలని వన్యప్రాణి ప్రేమికులు కోరుతున్నారు.
వన్య ప్రాణులకు ముప్పు వాటిల్లకుండా వేటగాళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాం. వన్య ప్రాణుల సంరక్షణపై గిరిజన గ్రామాల్లోని ప్రజలకు అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కూడా కల్పిస్తున్నాం. చింతోనిగుంపు, బాలాజీపేట గ్రామాల్లో ఇటీవల అడవి పందిని చంపిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేశాం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి జంతువులను వేటాడడం నేరం. వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– సువత్సలారెడ్డి ఎఫ్ఆర్వో, బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీలోని అనేక గ్రామాలు అడవిని ఆనుకొని ఉండడంతో వేటగాళ్ల ఉచ్చులో పడి వన్యప్రాణులు విలవిల్లాడుతున్నాయి. పంటల కోసం అవి వస్తుండడంతో వేటగాళ్లు ఉచ్చులు, విద్యుత్ తీగలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొండగొర్రె, అడవి పందులు, దుప్పులు, కుందేళ్లు, కొండముచ్చులు వంటి అడవి జంతువులు మృత్యువాత పడడంతో గుట్టుచప్పుడు కాకుండా మాంసాన్ని మైదాన ప్రాంతాల్లోని రహస్య ప్రదేశాలకు తీసుకొచ్చి కిలో రూ. 500 నుంచి రూ. వేయి వరకు విక్రయిస్తున్నారు.
ముఖ్యంగా బయ్యారం మండలంలోని నామాలపాడు, మొట్లతిమ్మాపురం, పందిపాడు, బీరోనిమడవ, కారుకొండ, వినోభానగర్, టేకులగూడెం, కాచనపల్లి, సాంబతండా, చింతోనిగుంపు, రామచంద్రాపురం, కొత్తతండా, మిర్యాలపెంట గ్రామాల్లో వేట జోరుగా సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే అడవి పందిని వధించిన చింతోనిగుంపు, బాలాజీపేట గ్రామాలకు చెందిన నలుగురిపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
గతంలో వినోభానగర్ అడవుల్లో వన్యప్రాణుల కోసం నాటు బాంబులు ఏర్పాటు చేయగా వాటిని తిన్న కుక్క సైతం మృతి చెందింది. అడవుల పరిరక్షణలో కీలకపాత్ర పోషించే అటవీశాఖ సిబ్బంది వన్యప్రాణాల సంరక్షణలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడవుల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నీటితొట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నడూ లేని విధంగా వన్యప్రాణుల సంతతి వృద్ధి చెందింది. అయితే నేడు అందుకు తగినట్లుగా అటవీశాఖ వేటగాళ్లపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అటవీ సిబ్బంది వేటగాళ్లకు సహకరిస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరిహద్దు అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకొని వణ్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. మహాదేవ్‌పూర్ మండలం సూరారం గ్రామంలో మార్చి 3న వణ్యప్రాణి మాంసాన్ని అటవీశాఖ అధికారి కమల పట్టుకున్నారు. మాదోట సురేశ్ దుప్పి మాంసాన్ని అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ నెల 4న జిల్లాలోని కాటారం మండలం మేడిపల్లి వద్ద వాలుగను స్మగ్లింగ్ చేసే ముఠాను చెన్నైకి చెందిన వైల్డ్ లైఫ్ బ్యూరో అధికారులు పట్టుకుని ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. జిల్లా సరిహద్దులో పంటలను కాపాడుకోవడానికి కొందరు, అడవి జంతువులను వేటాడడానికి మరి కొందరు ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. దుప్పులు, ఇతర అడవి జంతువులు బలవుతుండగా వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారు.