పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఆ అక్కాచెళ్లెళ్లు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తు న్నారు. ఏడేళ్ల వయసులోనే సాగ్నిక ఏడు రికార్డులు సాధించి అబ్బురపరిచింది. ఆవర్తన పట్టికలో ని 118 మూలకాలను 30 సెకండ్లలో చెప్పి తెలుగు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం, జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకుంది. వీటితోపాటు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్, ఎక్స్ క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన చోటు దక్కించుకుంది. అక కంటే తనేమీ తీసుపోనని నిశ్విక రెండేళ్లకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించి ఔరా అనిపించింది. రాష్ట్రాలు, రాజధానులు పేర్లను కేవలం 40 సెకండ్లలో చెప్పి ప్రజ్ఞను కనబరిచింది. ఈ బాల మేధావులను మెమొరీని చూసి పలువురు ప్రశంసలతోపాటు అభినందిస్తున్నారు.
– శాయంపేట, ఆగస్టు 25
శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన పులుమాటి ఓంకార్, దివ్య దంపతుల కుమార్తెలు సాగ్నిక, నిశ్విక అద్భుతమైన మెమొరీని ప్రదర్శిస్తున్నారు. సాగ్నిక ప్రస్తుతం మూడో తరగతి చదువుతోంది. ఈమె తమ ప్రతిభా పాటవాలతో 2022వ సంవత్సరంలో ఆవర్తన పట్టికలోని 118 మూలకాలను 30 సెకండ్లలో చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్, జాకీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించింది. దేశంలోని రాష్ట్రాల రాజధానుల పేర్లు 20 సెకండ్లలోనే చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, 60 సెకండ్లలో 38 అబ్రివేషన్ చెప్పడం ద్వారా ఎక్స్‌క్లూజివ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఏడాది బ్రాంచెస్ ఆఫ్ స్టడీస్‌ని 30 సెకండ్లలో 34 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ని సొంతం చేసుకుంది. దీంతో పాటు గణితం ఒలింపియాడ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అబాకస్, సుడోకు, మ్యాజిక్, రూబీ, కాప్సాలు చేసి అబ్బురపరుస్తోంది. రెండేళ్ల నిశ్విక అక్క దారిలోని నడుస్తున్నది. దేశంలోని రాష్ట్రాలు, రాజధానుల పేర్లను కేవలం 40 సెకండ్లలో చెప్పి ప్రతిభ కనబర్చింది. ఏ టు జెడ్ వరకు అక్షరాలు చెబితే వస్తువుల పేర్లు చెప్పడం, చూపించిన వస్తువుల పేర్లు చెప్పడం,కలర్స్, గేమ్స్, వాహనాలు, కూరగాయలు.. ఇలా 12 కేటగిరీల్లో ప్రతిభ చూపి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకుంది.
తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తిస్తే అద్భుతమైన రీతిలో రాణిస్తారనే దానికి ఓంకార్ దివ్య దంపతులు నిదర్శనం. దివ్యప్రైవేటు టీచర్‌గా పనిచేస్తుండగా, ఓంకార్ కంప్యూటర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కథలు, శ్లోకాలు, పద్యాలు, ఇలా ఏవి చెప్పినా, పాఠశాలల్లో నేర్చుకున్నవి కూడా యథావిధిగా చెప్పడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో వారికి అన్ని విషయాల్లో తర్ఫీదు ఇచ్చారు. కరోనా తమకు పూర్తిగా హెల్ప్ చేసిందని, పిల్లలను మేధావులుగా తీర్చిదిద్దే అవకాశం ఇచ్చిందని వారు చెప్పారు.
సాగ్నికస్ ఇన్ఫంటైన్మెంట్ పేరుతో ప్రత్యేక యూట్యూబ్ చానల్‌ను కొనసాగిస్తున్నారు. ఇందులో ఎక్కాలు త్వరగా, సులభంగా నేర్చుకోవడం, సుడోకు, టాంగ్రం, బ్రెయిన్విటా, రూబిక్క్యూబ్, వంటి మెదడుకు మేత పజిల్స్ ఉంటాయి. ఫింగర్స్‌తో అబాకస్ ఎలా చేయాలి?, అడిషన్, సబ్‌స్ట్రాక్షన్ ఎలా చేయాలి? వంటి విషయాలు నేర్పిస్తుంది.
సాగ్నిక, నిశ్విక ప్రతిభను రికార్డు చేసిన వీడియోలను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌తో పాటు ఏడు రికార్డ్స్ వెబ్సైట్లోకి పంపించారు. దీంతో పలు రికార్డులు దక్కాయి. దీంతో పాటు యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో సాగ్నిక సాధించిన విజయాలను జాతీయ స్థాయిలో పలు చానల్స్ ప్రసారం చేశాయి. పలు రికార్డులను సాధించిన సాగ్నిక, నిశ్వికలను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అభినందించారు. వీరి మెమొరీ పవర్‌ను, ప్రతిభను ప్రశంసించారు. తన వంతు పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అలాగే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిలు ఈ చిచ్చర పిడుగులను అభినందించారు.