ములుగు, జూలై 8 (నమస్తే తెలంగాణ) : ఇక్కడ నిండా నీటితో కనిపిస్తున్నది వాగు కాదు.. నేషనల్ హైవేనే. సోమవారం తెల్లవారుజామున రెండు గంటల పాటు కురిసిన వర్షానికి ములుగులోని జాతీయ రహదారి జలమయమై వాహనదారులకు చుక్కలు చూపిం చింది. వరద భారీగా వస్తుండడంతో వాహనాలు ముందుకు వెళ్లలేక రాకపోకలకు అంతరాయం కలిగిం ది. బస్సు, లారీ, కార్లు ఎలాగోలా వెళ్తున్నా.. ద్విచక్రవాహనదారులు వరద దాటలేని పరిస్థితి ఉంది.
అయితే ప్రతి వర్షాకాలం ఈ సమస్య ఎదురవుతున్నా ఎన్హెచ్ అధికారులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపడం లేదు. చివరకు ములుగు గ్రామ పంచాయతీ సిబ్బంది జేసీబీ సహాయంతో డివైడర్ను తొలగించి వరద నీటిని తరలించే పనులను చేపడుతున్నారు. ఎన్హెచ్ విస్తరణ పనులు చేపట్టక ముందు ప్రస్తుతం నిలుస్తున్న వరద నీటి స్థానంలో అప్పటి జాతీయ రహదారి కింది నుంచి పంట కాల్వలకు నీళ్లు వెళ్లే మార్గం ఉండేది. సంబంధిత కాంట్రాక్టర్ నీళ్లు వెళ్లేందుకు పైపులను వేయకపోవడంతో పాటు రోడ్డును డౌన్ చేయడం, పంట కాల్వలను కొందరు వ్యక్తులు కబ్జా చేయడంతో చిన్న పాటి వర్షానికి వరద నీరు ఇలా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.