హనుమకొండ, జూన్ 11 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రాన్స్‌కో పరిధిలో ఏర్పాటు చేసిన కొత్త సర్కిళ్ల వ్యవహారం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నది. సేవల మెరుగుదల కంటే ఆంధ్ర అధికారులకు ప్రమోషన్ల కోసమే ఈ తతంగమంతా జరుగుతున్నట్లు కనిపిస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు. అంతేకాక ఉద్యోగుల విభజన సైతం శాస్త్రీయంగా జరగలేదని విమర్శిస్తున్నారు. కింది స్థాయి సిబ్బంది కొరతను పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయాలతో తమపైనే అదనపు భారం పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సర్కిళ్లతో ముఖ్యంగా ఆర్టిజన్లు, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ (ఓ అండ్ ఎం) కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కోలో పలు విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఈ పరిస్థితిలో ముందుగా అవసరమైన ఉద్యోగులను నియమించి, తర్వాత కొత్త సరిళ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంతో తమకు ప్రాణసంకటంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. సీనియారిటీ, వ్యక్తిగత పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా, కార్మికులు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో సమాలోచన చేయకుండా బదిలీలు చేయడంపై మండిపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం సిబ్బంది దూర ప్రాంతాలకు బదిలీ కావడంతో తీవ్ర మానసిక, శారీరక ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ట్రాన్స్‌కోలోని పలు విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం కార్మికులు తగినంత లేకపోవడంతో విధులు నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ పరిస్థితుల్లో కొత్త సరిళ్లు ఏర్పాటు చేసి, వాటికి అవసరమైన సిబ్బందిని నియమించకుండా బదిలీలతో సర్దుబాటు చేయడం వల్ల సమస్య మరింత పెరిగిందంటున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో గతంలో కొత్త సరిళ్లు ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగుల విభజనను సీనియారిటీ ప్రాతిపదికన నిర్వహించారని, అందువల్ల పెద్దగా వివాదాలు తలెత్తలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ట్రాన్స్‌కోలో మాత్రం అలాంటి విధానాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా దూర ప్రాంతాలకు బదిలీలు చేసి అక్కడే విధులు నిర్వర్తించాలనే నిబంధన విధించడం దారుణమంటున్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించినప్పటికీ అధికారులు స్పందించడం లేదని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఉద్యోగుల సంక్షేమం, సంస్థ పనితీరును దృష్టిలో ఉంచుకొని ట్రాన్స్‌కో యాజమాన్యం తక్షణం సమస్యలకు పరిషారం చూపాలని ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త సరిళ్ల ఏర్పాటుపై మరోసారి పునః సమీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. మౌలిక వసతులు, సిబ్బంది అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే సరిళ్లను ఏర్పాటు చేస్తే సంస్థపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల విభజనను పారదర్శకంగా నిర్వహించి, సీనియారిటీతో పాటు ఉద్యోగుల వ్యక్తిగత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు, కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో జేఏసీని ఏర్పాటు చేసుకొని సమస్యలపై పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ విషయమై ట్రాన్స్మిషన్ అండ్ పవర్ గ్రిడ్ డైరెక్టర్ సంపత్‌కుమార్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు.
ట్రాన్స్‌కో వరంగల్ జోన్ పరిధిలో ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం జిల్లాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్తగా జనగామ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. వరంగల్ సర్కిల్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగామ పరిధిలో మహబూబాబాద్, జనగామ జిల్లాలను చేర్చారు. వరంగల్ సర్కిల్ పరిధిలో 25, జనగామ పరిధిలో 18 సబ్ స్టేషన్లున్నాయి.