సారంగాపూర్ : జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం కొల్వాయి మండలం ఎత్తిపోతల పథకాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి ( Jeevan Reddy ) సోమవారం రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కాలిపోయిన మోటార్లను పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీళ్లు అందక సాగు చేయడం లేదని రైతులు వాపోయారు. విద్యుత్ డీఈ, ఎస్ఈలతో జీవన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు.
కొల్వాయి ఆరేపల్లి లో మోటార్లు మరమ్మతు చేయించాలన్నారు. ఏడాదికాలంగా మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. అధికారులు అంచనాలు రూపొందించేది ఎప్పుడు? నీళ్లు అందించేది ఎప్పుడని ప్రశ్నించారు. రైతుల అదృష్టం కొద్ది కాలువలో నీళ్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మోటర్లు మరమ్మతు చేపట్టి పంపులు వినియోగించాలని కోరారు.
ఈనెల 31లోగా మోటార్ల మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల రీప్లేస్మెంట్ చేయగలిగితే ఖరీఫ్ పంట సాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే పంటలు ఎండిపోవడానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నీళ్లు ఉండి కూడా పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. అన్ని పంపు సెట్లు వినియోగంలో తీసుకువచ్చి ఖరీఫ్ పంటకు నీరు అందించాలని కోరారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసేందుకు అధికారులు పంపుసెట్లు పరిశీలించాలని అధికారులకు సూచించారు.