ములుగు, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): పాలనా సౌలభ్యం కోసం తండాలు, గూడాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ వాటి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. తాజాగా నూతన గ్రామపంచాయతీలతోపాటు పాత పంచాయతీలకు అన్ని హంగులతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. జీపీ భవనానికి రూ.20లక్షల చొప్పున కేటాయించారు. ఈమేరకు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయగా ఆయా గ్రామాల్లో ప్రజలు, సర్పంచ్లు, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
37 భవనాలు.. రూ.7.40కోట్లు
జిల్లాలో మొత్తం 174 గ్రామపంచాయతీలు ఉండగా 37 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.7.40కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో జిల్లాలో శిథిలావస్థకు చేరిన జీపీ భవనాలను, కొత్త జీపీలకు కార్యాలయాలను నిర్మించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాయత్తం అవుతున్నారు. వెంకటాపురం (నూగూరు) మండలంలో బెస్తగూడెం, బోదాపురం, రాచపల్లి, రామచంద్రాపురం, తిప్పాపురం గ్రామపంచాయతీలకు నూతన భవనాలను త్వరలో నిర్మించనున్నారు. వాజేడు మండలంలో చీకుపల్లి, దూలాపురం, పెద్దగొల్లగూడెం, పూసూరు గ్రామాలకు, ఏటూరునాగారం మండలంలో ఆకులవారిఘనపురం గ్రామపంచాయతీకి, గోవిందరావుపేట మండలంలో గాంధీనగర్, కోటగడ్డ, మచ్చాపూర్, ముత్తాపూర్, రాఘవపట్నం, రంగాపూర్, సోమలగడ్డ జీపీలకు, కన్నాయిగూడెం మండలంలో కంతనపల్లి జీపీకి, మంగపేట మండలంలో బ్రాహ్మణపల్లి, కొత్తూరు మొట్లగూడెం, నర్సాయిగూడెం, పూరేడుపల్లి, రామచంద్రునిపేట, తాడ్వాయి మండలం బందాల, కామారం, రంగాపూర్, వెంగళాపూర్ జీపీలకు, వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లి, రాజేశ్వర్రావుపల్లి, సింగరికుంటపల్లి, తిమ్మాపూర్, ములుగు మండలం బరిగలానిపల్లి, గుర్తూర్తండా, జీవంతరావుపల్లి, కొత్తూరు, ముద్దునూరుతండా, రామచంద్రాపూర్ గ్రామపంచాయతీలకు కొత్త కార్యాలయాలను నిర్మించనున్నారు. ఇంజినీరింగ్ శాఖ అధికారులు త్వరలో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను ముగించి అందుబాటులోకి తేనున్నారు.
ఎదురుచూస్తున్నాం
మా గ్రామం బరిగలానిపల్లి. మండలం ఇంచర్ల గ్రామపంచాయతీ పరిధి హామ్లెట్ విలేజీ. ప్రభుత్వం మా గ్రామాన్ని కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. కొత్త జీపీ భవనం కోసం ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతం మంజూరు కావడంతో త్వరలో అన్ని సౌకర్యాలతో కార్యాలయం నిర్మాణం కానుంది.
– లత, బరిగలానిపల్లి సర్పంచ్, ములుగు మండలం
కొత్త భవనం మంజూరు హర్షనీయం
ములుగు మండలంలోనే పురాతన జీపీ కార్యాలయం మాదే. 1976లో అప్పటి వెంగళ్రావు సీఎంగా ఉన్నప్పుడు నిర్మించగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఏటా రిపేర్లు చేయించుకుంటూ వస్తున్నాం. సీఎం కేసీఆర్ మా గ్రామానికి కొత్త భవనాన్ని మంజూరీ చేయడం హర్షనీయం.
– హట్కర్ కల్పనా రూప్సింగ్, రామచంద్రాపూర్ సర్పంచ్, ములుగు మండలం
గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు
మా జీపీ కార్యాలయం కూలిపోయే దశకు చేరింది. జాతీయ రహదారి ఎత్తుగా నిర్మించినందున రోడ్డు కిందకి భవనం ఉంది. ఇప్పుడు కొత్త భవనానికి నిధులు మంజూరయ్యాయి. అందుకు గ్రామస్తులు, పాలకవర్గం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– రేగూరి రవీందర్రెడ్డి, మచ్చాపూర్ సర్పంచ్, గోవిందరావుపేట మండలం