జనగామ, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని డొల్ల బడ్జెట్‌ను కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిందని, అంకెలగారడీతో మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలిందని మండిపడ్డారు. శనివారం సాయంత్రం జనగామలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులకు భృతిలేదని.. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేద ని, ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ, పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లింపునకు బడ్జెట్లో ఊసేలేకుండా ధోకా చేసిందని పల్లా మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్‌పై మహిళలు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు అడియాసలు అ య్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధులకు రూ.4వేల పింఛన్, మహిళలకు రూ. 2,500, ఆడపిల్లలకు స్కూటీలు, ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం అటకెక్కిందన్నారు. ఆశ వరర్లు, అంగన్వాడీ వరర్లు వేతనాలు పెంచాలని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని తనకు వినతులు వచ్చాయన్నారు.
గవర్నర్ ప్రసంగం పై మాట్లాడే అవకాశం వస్తే తాను జనగామ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి ప్రభు త్వం, మంత్రుల దృష్టికి తెస్తున్నానని అన్నా రు. చాలా గ్రామాల్లో రోడ్లు సరిగా లేక బస్సు లు రావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వివరించారు. రైతులు పండించిన మకజొన్నలు కొనకపోవడంతో బీఆర్ఎస్ చేసిన ఆందోళన ఫలితంగానే మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. చిన్నచిన్న సమస్యలు, కొద్దిపాటి నిధులకు కూడా ప్రభుత్వం స్పం దించడంలేదని.. దున్నపోతు పై వాన పడ్డట్లు ఉందన్నారు. గతంలో అసెంబ్లీలో మాట్లాడితే రాసుకొని సమాధానం ఇచ్చేవాళ్లు.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు.
డబ్బులు ఇవ్వకపోవడం తో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందు కు రావడంలేదని, ప్రభుత్వంపై ప్రజలకు, వారికి విశ్వాసం లేదన్నారు. రెండేళ్లలో అన్ని అంశాల్లో మోసం చేసిన కాం గ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక రూపా యి కూడా బడ్జెట్లో కేటాయించలేదన్నారు. ఇరిగేషన్ అంశంపై బడ్జెట్ సమావేశంలో మాట్లాడే అవకాశం వస్తే జనగామ ప్రాంత సాగునీటిపై మాట్లాడి రైతుల పక్షాన కొట్లాడుతానని ఎమ్మెల్యే పల్లా తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు జలాలు తరలించి చెరువులు నింపాలని కోరడంతోపాటు దేవాదుల ప్రాజెక్టులకు సంబంధించి ఇరిగేషన్ పనులు పూర్తిచేసేందుకు రూ.3000 కోట్లు కావాలని సీఎంను గతంలో కలిసి కోరానన్నారు.
జనగామ నియోజకవర్గంలో దేవాదుల కాల్వలు, ఇతర పనులకు రూ.600 కోట్లు అవసరమని చెప్పారు. జనగామ కలెక్టర్ వనిత టీ స్టాల్ నిర్వాహకులైన దళిత మహిళలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. గత కలెక్టర్ ప్రారంభించిన స్టాల్స్‌ను తొలగించాలని చూడడం మంచిది కాదని, దీనిపై లేఖ రాసినట్లు చెప్పారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, జనగామ మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలు, బీఆర్ఎస్ నాయకులు ఇర్రి రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలనర్సయ్య, తాళ్ల సురేశ్‌రెడ్డి, జేరిపోతుల కుమార్, గుర్రం నాగరాజు, నీల యాదగిరి, కౌన్సిలర్లు సువార్త, సేవెల్లి మధు, గోపగోని సుగుణాకర్, దుర్గాప్రసాద్, మామిడాల రజిత, వెన్నెల, అనిత, అనూష తదితరులు ఉన్నారు.