న్యూఢిల్లీ, ఆగస్టు 5 : ప్రముఖ ఇంటర్నెట్ సర్చ్ ఇంజిన్ గూగుల్ మరోసారి సత్తాచాటింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులపై నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది ఆకర్షణీయమైన సంస్థల్లో గూగుల్ తొలివరుసలో నిలిచింది. రాండ్స్టాడ్ ఎంప్లాయిర్ బ్రాండ్ రీసర్చ్(ఆర్ఈబీఆర్) 2026 పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యధిక మంది ఉద్యోగులు తమకు గూగుల్ ఆకర్షణీయమైన సంస్థ అని స్పష్టంచేశారు.
ఆ తర్వాత స్థానాల్లో టాటా గ్రూపు, అమెజాన్లు నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా 1.75 లక్షల మందితోపాటు భారత్ నుంచి 3,500 మంది ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూ పొందించింది. ఈ సందర్భంగా రాండ్స్టాడ్ ఇండియా ఎండీ నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ..సర్వేలో పాల్గొన్న మొత్తం ఉద్యోగుల్లో సగం మంది వచ్చే ఆరు నెలల్లో తమ కెరియర్ను మార్చుకోవాలని చూస్తున్నారన్నారు. భారత్లో ఉద్యోగ భద్రతకు నమ్మదగిన వేతనం, ప్రయోజనాలతోపాటు పనితీరుకు గుర్తింపు, వృత్తిపరమైన కొనసాగింపు అనేవి అత్యంత బలమైన పునాదులని చెప్పారు.