హనుమకొండ చౌరస్తా, జూన్ 24 : దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) విద్యార్థులు 2025-26 ప్లేస్మెంట్ సీజన్లో మరోసారి తమ అద్భుత ప్రతిభను చాటారు. నిట్ సీఎస్ఈ విద్యార్థి నయన్ త్యాగి రూ.1.27 కోట్ల ప్యాకేజీతో ఎంపికైన విషయం తెలిసిందే. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థుల ప్లేస్మెంట్లో సంస్థ అత్యుత్తమ ఫలితాలు నమోదు చేసిందని, అర్హత కలిగిన 704 మంది యూజీ విద్యార్థుల్లో 660 మందికి పైగా ఉద్యోగాలు లభించగా, 93.75 శాతం ప్లేస్మెంట్ రేటు నమోదైందని, పీజీ స్థాయిలో 860 మంది విద్యార్థుల్లో 677 మంది ఉద్యోగాలు సాధించి 78.72 శాతం ప్లేస్మెంట్ రేటును నమోదు చేశారని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి తెలిపారు.
ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఇంటర్న్షిప్లు కొనసాగిస్తూ పూర్తిస్థాయి ఉద్యోగ ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. ఈ ప్లేస్మెంట్ సీజన్లో నిట్ వరంగల్ చారిత్రాత్మక మైలురాయిని సాధించిందని చెప్పారు. దేశీయంగా అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ రూ.1.27 కోట్లకు చేరుకోగా, రూ.70 లక్షల కంటే అధిక విలువ కలిగిన అనేక ఆఫర్లు విద్యార్థులకు లభించాయని, యూజీ విద్యార్థులకు సగటు సీటీసీ రూ.18.54 లక్షలు, మధ్యస్థ (మీడియన్) సీటీసీ రూ.15 లక్షలు నమోదైనట్లు, పీజీ విద్యార్థులకు సగటు సీటీసీ రూ.12.13 లక్షలు, మీడియన్ సీటీసీ రూ.9 లక్షలుగా నమోదవగా, ముఖ్యంగా అన్ని యూజీ విభాగాల్లో గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్లేస్మెంట్ శాతాలు నమోదయ్యాయన్నారు.
2025- 26 ప్లేస్మెంట్ డ్రైవ్లో 360కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయని, ఇది గత సంవత్సరాలతో పోలిస్తే గణనీయంగా పెరిగిందన్నారు. ఆరుగురు విద్యార్థులు రూ.70 లక్షలకు పైగా వార్షిక వేతన ఆఫర్లను పొందారని, 27 మంది రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీలను సాధించారన్నారు. 130 మందికి పైగా విద్యార్థులు రూ.30 లక్షలకుపైగా వార్షిక వేతన ఆఫర్లు పొందగా, 720 మందికి పైగా విద్యార్థులు రూ.10 లక్షలకు మించిన ప్యాకేజీలను సాధించారన్నారు. సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ (410 ఆఫర్లు), కోర్ ఇంజినీరింగ్ (480 ఆఫర్లు), అనలిటిక్స్ (230 ఆఫర్లు)తో పాటు ఇతర రంగాల్లోనూ గణనీయమైన ఉద్యోగావకాశాలు లభించాయన్నారు.
మూడు సంవత్సరాల ప్లేస్మెంట్ గణాంకాలు కూడా ఎన్ఐటీ పురోగతిని స్పష్టంగా చూపిస్తున్నాయని, 2024లో 305 సంస్థలు పాల్గొనగా, 2026 నాటికి ఈ సంఖ్య 360కు పైగా పెరిగిందన్నారు. యూజీ ప్లేస్మెంట్ శాతం 83 శాతం నుంచి 93.75 శాతానికి పెరిగిందన్నారు. విద్యార్థులకు నిరంతరం సాఫ్ట్ సిల్స్ శిక్షణ అందిస్తూ వారి కెరీర్ అభివృద్ధికి కృషి చేస్తున్న సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్ మెంట్ (సీసీపీడీ) బృందాన్ని, అధిపతి ప్రొఫెసర్ పీవీ సురేశ్ నాయకత్వాన్ని ఆయన ప్రశంసించారు. ఈ ప్లేస్మెంట్ విజయం సంస్థలోని విద్యానాణ్యత, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి, సమష్టి కృషికి నిదర్శనమన్నారు. అలాగే సంస్థ డీన్లు, విభాగాధిపతులు, రిజిస్ట్రార్ విద్యార్థులతో పాటు సీసీపీడీ బృందానికి అభినందనలు తెలిపారు.