స్టేషన్‌ఘన్‌పూర్/హనుమకొండ సబర్బన్, మార్చి 17 : కష్టాలు, సుఖాలు మిళితమై ఉంటేనే జీవితానికి అర్ధం.. పరమార్ధం. అలాగే తెలుగు నూతన సంవత్సరంగా భావించే ఉగాది పర్వదినం సందర్భంగా చేసుకునే పచ్చడిలో ఆరు రుచులు (షడ్రుచులు) ఉంటాయి. ఆనందానికి, మనం పొందే విజయాలకు తీపి (బెల్లం), కొత్త అనుభవాలు, ఆశ్చర్యానికి పులుపు (చింతపండు), బాధలు, కష్టాలకు చేదు (వేప పువ్వు), కోపానికి కారం, జీవితంలో సమతుల్యతకు ఉప్పు, ఆశలు, కొత్త ప్రారంభాలకు వగరు (మామిడి ముక్కలు) రుచులతో చేసుకునేదే ఉగాది పచ్చడి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా, ఎక్కువైనా రుచి మారి పచ్చడి తాగలేని విధంగా ఉంటుంది. అలాగే, సంతోషం, ఆశ్చర్యం, బాధ, కోపం, ఆశ ఇలా అన్నీ కలిసి ఉంటేనే జీవితానికి అర్ధం ఉంటుంది.
వీటిని ఎదుర్కొని నిలబడాలనే సందేశంతోపాటు ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపేదే ఉగాది పచ్చడి. ఈ పండుగ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది వగరు, వేప పువ్వు, పచ్చడి కుండకు వేప ఆకులతో అలంకరణ. కానీ, ఈసారి వేప చెట్లు ఒక రకమైన వ్యాధితో ఎక్కడ చూసినా ఎండిపోయి కనిపిస్తున్నాయి. వాటికి ఇగుర్లు, పువ్వు మచ్చుకైనా కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది పరాభవ నామ ఉగాదికి అవసరమైన వేప పువ్వు దొరకడం కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. బతుకమ్మ పండగకు తంగేడు పువ్వును కొనుగోలు చేసినట్లే వేప పువ్వు, ఆకులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే, ఈసారి వేప పువ్వు లేకుండానే ఐదు రుచులతోనే పచ్చడి తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

ఔషధ మహరాజ్‌కు ఆపద
వేప చెట్టును ఔషధ గుణాల్లో మహరాజుగా కీర్తిస్తారు. వేప ఆకుల్లో 150 రకాల మేలు చేసే కారకాలుంటాయని చెబుతుంటారు. వేసవి వచ్చిందంటే చాలు ఫ్యాన్లు, ఏసీలు లేని కాలంలో జనం మొత్తం వేప చెట్లకిందనే కాలక్షేపం చేసే వారు. ఇండ్లలో పిల్లలకు చికెన్ పాక్స్ (అమ్మవారు) సోకితే వేప ఆకులను వినియోగిస్తారు. బోనాలు, ఇతర పూజల్లో కూడా వేపాకులను విరివిగా ఉపయోగిస్తారు. కేవలం ఆకులే కాకుండా వేప వేర్లు, కాండం కూడా పలు ఆయుర్వేద చికిత్సల్లో వినియోగిస్తారు. అనేక చర్మ వ్యాధులు, ముఖ సౌందర్యం, అతి మూత్ర, జ్వరం వంటి అనేక వ్యాధులను వేపతో నయం చేయొచ్చు. కొందరైతే నిత్యం వేప పుల్లతోనే పండ్లు తోముకోవడం పరిపాటి.
వేప పండ్ల ద్వారా తీసిన పిండిని, రసాన్ని వ్యవసాయంలో పలు రకాల పురుగుల నివారణకు రైతులు వినియోగిస్తారు. ఇలాంటి విశిష్ట ప్రయోజనాలున్న వేపచెట్టుకు గత నాలుగేండ్లుగా అనారోగ్యం సోకింది. టీ మస్కిటో, లోరంథాస్ అనే పలు రకాల వైరస్లు వేపచెట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సారి మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంది. కనీసం ఉగాది పచ్చడికి కూడా పువ్వు దొరికే పరిస్థితి లేకపోవడం సమస్య తీవ్రతకు అద్దంపడుతున్నది. 1980లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తొలిసారి ఈ సమస్యను గుర్తించినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడు డిపాక్ డిసీజ్ ఆఫ్ నీమ్గా నామకరణం చేసి, నివారణకు అప్పటి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినట్లుగా చెబుతారు. ప్రస్తుతం వేప చెట్టును కాపాడే ప్రయత్నం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
పండ్ల పుల్ల దొరుకుత లేదు
రోజూ పొద్దుగాల లేసుడుతోనే మా వ్యవసాయ బావి దగ్గరికి పోయి వేప పుల్లతో పండ్లు తోముకుం ట పొలంల తిరిగేది. దీంతో టి చిగుర్ల సమస్యలు అసలే రావని పెద్దోళ్లు చెప్పెటోళ్లు. నాకు ఊహ తెలిసిన కాన్నుంచి పండ్లు తోముకునేటందుకు వేప పుల్లనే వాడుతున్న. అయితే, ఇప్పు డు ఆరు నెలలుగా వేప చెట్లన్నీ ఎండిపోతున్నయి. చూద్దామంటే కూడా వేప పుల్ల కనిపించడంలేదు. మళ్లీ టూత్ పేస్టును ఉపయోగించాల్సి వస్తున్నది. వేపచెట్ల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.
– కొమ్మిడి రమణారెడ్డి, రైతు, ఎల్కతుర్తి
వేప చెట్టును రక్షించుకోవాలి
ఔషధ మొక్కలకే రారాజైన వేప చెట్టు ప్రమాదంలో పడింది. తెలుగు రాష్ర్టాల్లో ఈ చెట్ల వేర్లు, ఆకులు, కాండా లు, పువ్వును ఔషధాలుగా ఉపయోగించుకుంటున్నాము. వీటిలో నింబిన్, నింబిడిన్ అనే రసాయనిక పదార్థాలుంటాయి. వీటితో సబ్బులు, కాస్మొటిక్స్, పేస్ట్‌లు, పౌడర్లు తయారు చేస్తారు. అయితే వేప చెట్లకు పొటాసిస్, పొమాసిస్ అజారెక్టే అనే శిలీంధ్రం సోకడం వల్ల ఎండిపోతున్నాయి. సైపర్మెత్రిన్, డెమెక్రాన్, కార్బండైజ్, బ్రూటకాన్ లాంటి పెస్టిసైడ్స్‌ను నీటిలో కలిపి వాడితే ఈ శిలీంధ్రాలను చంపగలం.
– డాక్టర్ టీ ఆశీర్వాదం, వృక్షశాస్త్ర నిపుణుడు