ప్రకృతి విపత్తు వరంగల్ నగరాన్ని అతలాకుతలం చేసింది. జోరు వానతో ముంచెత్తిన వరద వేలాది కుటుంబాలను ఆగం చేసింది. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వరద బాధిత కుటుంబాలకు కనీస సాయం చేయకుండా తప్పించుకుంటున్నది. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవడంలో విఫలమైంది. విపత్తు జరిగి రెండు వారాలైనా తక్షణ సాయం అందించకుండా మొండిచేయి చూపింది. నష్టపోయిన కుటుంబాల వివరాల సేకరణలోనూ జాప్యం చేసింది. వరదలు వచ్చిన వారం తర్వాత సర్వే మొదలుపెట్టింది. ప్రభుత్వ యంత్రాంగం సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బాధితుల వివరాలను సగంసగమే సేకరించింది.
– హనుమకొండ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
గ్రేటర్ వరంగల్‌లో వరదల కారణంగా అన్నీ కోల్పోయిన బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. విపత్తు సంభవించి రెండు వారాలైనా బాధిత కు టుంబాలు కోలుకోవడం లేదు. వాన తగ్గిన నాలుగు రోజుల వరకు కూడా అనేకకాలనీలు వరదనీటిలోనే ఉన్నాయి. నీరంతా బయటకు వెళ్లిన తర్వాత మరో నాలుగు రోజుల వరకు పారిశుధ్య నిర్వహణ లేక కాలనీలు కంపు కొట్టడంతో ప్రజలు ఇబ్బం ది పడ్డారు. ఇప్పుడిప్పుడే ఆయా కాలనీలు కోలుకుంటున్నాయి. వరదలో చిక్కుకున్న పేదలు మరింత ఇబ్బంది పడుతున్నారు. కష్టపడి సంపాదించిన వస్తువులన్నీ వరద పాలు కాగా, తినడానికి తిండి లేని పరిస్థితులు నెలకొన్నాయి.
పని చేసుకుంటేగానీ పూట గడవని కూలీ కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వీరి దయనీయ స్థితిని చూసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రావడంలేదు. తక్షణ సాయం ఎప్పుడిస్తారో తెలియడం లేదు. బాధిత కుటుంబాలను పట్టించుకోవడం లేదు. వరదల తర్వాత అక్టోబర్ 31న వరంగల్ నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధిత కుటుంబానికి రూ.15 వేల చొప్పున సాయం చేస్తామని, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తామని ప్రకటించారు. వరదలు వచ్చి వెళ్లినట్లుగానే సీఎం హామీలు కూడా అమలు కాకుండా పోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవ దూరంగా నివేదిక..
వరంగల్ వరద బాధితులపై ప్రభుత్వ తీరు భిన్నంగా ఉంది. గ్రేటర్లో నీట మునిగిన ఇండ్లపై అధికారులు సర్వే చేసి ఇచ్చిన నివేదిక వాస్తవానికి దూరంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. వందకు పైగా కాలనీల్లోని 10 వేలకు పైగా ఇండ్లు పూర్తిగా నీట మునిగినట్లు అంచనా. అయితే ఆలస్యంగా మేలుకున్న అధికారులు హడావుడిగా సర్వే చేసి కేవలం 6,465 ఇండ్లు మాత్రమే మునిగినట్లు నివేదిక రూపొందించారు. చాలా కాలనీల్లో పూర్తిగా సర్వే చేయలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు చేసిన సర్వేలో పేర్కొన్న ఇండ్ల కంటే ఎక్కువగానే వరద బారిన పడ్డాయని చెబుతున్నా రు. వరంగల్ నగర ముంపునకు శాశ్వ త పరిష్కారం, వరద నష్టం అంచనాలపై వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నగర పరిధిలోని మంత్రి కొండా సురేఖ, గ్రేటర్ ఎమ్మెల్యేలు, మేయర్, కలెక్టర్లు, కమిషనర్ ఇప్పటి వరకు కనీసం సమీక్షించలేదు. జూబ్లీహిల్స్ ప్రచారంలో ఉండి ఇక్కడి వరద బాధితులను పట్టించుకోవడంలేదు