హనుమకొండ చౌరస్తా, మే 15: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లోని శిక్షణ, అభ్యాస కేంద్రం(సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్-సీటీఎల్) ఆధ్వర్యంలో ‘ఏఐఓటీ (కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వాటి అనువర్తనాలు’ అనే అంశంపై నెలరోజుల పాటు జరిగే జాతీయస్థాయి ఇంటర్న్‌షిప్, సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నిట్ డీన్ ప్రొఫెసర్ పి.రతీష్‌కుమార్ ప్రారంభించగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డీఆర్డీవో, హైదరాబాద్ శాస్త్రవేత్తలు డాక్టర్ జి.మల్లికార్జునరావు, డాక్టర్ కనికే శ్రీనివాసులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
కార్యక్రమ నిర్వాహకులు సీటీఎల్ అధిపతి ప్రొఫెసర్ టి.కిశోర్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రతీష్‌కుమార్ మాట్లాడుతూ ఇంటర్న్‌షిప్ కార్యక్రమం విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ స్కిల్స్‌ను అందించడానికి రూపుదిద్దుకుందని, ఇలాంటి శిక్షణలతోనే భవిష్యత్తు పౌరులను ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దవచ్చన్నారు. ప్రొఫెసర్ టి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థల నుండి కేవలం ఐదు రోజుల్లోనే 120పైగా విద్యార్థులు నమోదు చేసుకోవడం మంచి విషయం అన్నారు. నిపుణులైన బోధన సిబ్బంది ద్వారా లెక్చర్లతో పాటు ప్రాక్టికల్ సెషన్లు కూడా నిర్వహించబడతాయని చెప్పారు.
ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ జి. మల్లికార్జునరావు ‘రక్షణ రంగంలో కృత్రిమ మేధస్సు పాత్ర’పై కీలక ప్రసంగం చేశారు. ‘ఏఐ ఆధారిత సాంకేతికతలు రక్షణ వ్యవస్థల్లో గణనీయమైన మార్పులు తీసుకువస్తున్నాయని, ఇవి నిర్ణయ ప్రక్రియను మెరుగుపరచడంలో, పనిసామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశ భద్రత కోసం ఏఐ వినియోగం తప్పనిసరిగా మారిందన్నారు. కనికే శ్రీనివాసులు విద్యార్థులను ఏఐఓటీ లోని విస్తృత అవకాశాలను అర్థం చేసుకుని, రక్షణ, వ్యవసాయం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలలో తమ పాత్రను నిర్వర్తించేందుకు ప్రేరేపించారు.