హనుమకొండ, సెప్టెంబర్ 21 : గ్రామీణ తపాలా ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలోని ఆయన నివాసంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఆలిండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం హనుమకొండ డివిజన్, తెలంగాణ సర్కిల్ నాయకులతో కలిసి మాట్లాడారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు జాతీయ మహా సభలను చారిత్రక ఓరుగల్లు నగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. నవంబర్ 19, 20, 21 తేదీల్లో నిర్వహించనున్న ఈ మహా సభకు దేశవ్యాప్తంగా 3వేల మంది ప్రతినిధులు, 3లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు హాజరు కానున్నారని తెలిపారు. గతంలో కేంద్రంలోని ప్రభుత్వాలు పోస్టల్ వ్యవస్థనే రద్దు చేయాలని చూశాయన్నారు. ప్రైవేటీకరణ ముసుగులో పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూశారని పేర్కొన్నారు. హనుమకొండ, కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తపాలా కార్మికుల హక్కుల కోసం కొట్లాడానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పోస్టు బ్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించనుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గ్రామీణ తపాలా ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు కృషి చేస్తున్నారన్నారు. కానీ వారి సమస్యలను గతంలో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తపాలా ఉద్యోగులపై సానుకూలంగా ఉందని, సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. చారిత్రక ఓరుగల్లు నగరంలో నిర్వహించనున్న 12వ జాతీ య మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే అసంఘటిత కార్మికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. కేం ద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తపాలా ఉద్యోగుల సమస్యలకు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, బీఆర్ఎస్ నాయకులు చింతల యాదగిరి, నయీం, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బండి జయరాజ్, హనుమకొండ డివిజన్ సెక్రటరీ బొద్దున వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.