నర్సంపేట, అక్టోబర్ 7 : నర్సంపేట మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్‌గా మారనున్నది. పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పది గ్రామాలను విలీనం చేసి నగరపాలక సంస్థగా అప్‌గ్రేడ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించగా ఎమ్మెల్యే, ప్రభుత్వ పరిశీలన కోసం సమర్పించారు. తాజాగా కలెక్టర్‌కు ఆ ఫైల్ చేరగా డీపీవో, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్కు చేరగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నర్సంపేటలో 2011 లెక్కల ప్రకారం 37,500 జనాభా ఉంది. కానీ ఇప్పుడు 44,500కి పెరిగింది. గతంలో నర్సంపేటలో కమలాపురం, ద్వారకపేట, సర్వాపురం గ్రామాలు విలీనం కావడంతో నగర పంచాయతీగా, ఆ తర్వాత మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. తాజాగా కార్పొరేషన్‌గా మార్చేందుకు నర్సంపేట చుట్టుపక్కన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను విలీనం చేయాలని నిర్ణయించారు. 60 నుంచి 80వేలకు పైగా జనాభాతో కార్పొరేషన్ చేయాలని సంకల్పించారు. మాదన్నపేట, నాగుర్లపల్లి, మహేశ్వరం, ముగ్ధుంపురం, రాజపల్లె, ముత్తోజీపేట, రాజుపేట, రాములునాయక్ తండా, పర్శునాయక్ తండా, పసునూరు గ్రామాలను విలీనం చేయడం వల్ల అనుకున్న జనాభా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఇప్పటికే కలెక్టర్ నుంచి మండల పరిషత్ కార్యాలయానికి, మున్సిపాలిటీకి ఫైల్ చేరగా వాస్తవ పరిస్థితులను అధికారులు అంచనాలు వేస్తున్నారు. కార్పొరేషన్ అయితే ఎక్కువ నిధులు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల్లోపు అయితే విలీనమయ్యే గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించరు. ఒకవేళ సాధ్యం కాకపోతే ఆయా గ్రామాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఎన్నికలు తర్వాత అయితే కౌన్సిలర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అధికారులు కావాల్సిన సమాచారాన్ని పూర్తిస్థాయిలో సేకరించే పనిలో ఉన్నారు. అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఫైల్ తిరిగి ప్రభుత్వానికి చేరనుంది. జనాభా ప్రకారం నర్సంపేట ఏ స్థాయి మున్సిపాలిటీని కేటాయిస్తారనేది చర్చ కొనసాగుతున్నది.