కరీమాబాద్ జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఒక కల. ఆ కల కోసం ఎందరో యువతీయువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రంగసాయిపేటలోని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ..తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అమరుల త్యాగాలకు నివాళి అర్పించే పర్వదినం అన్నారు.
తెలంగాణ సాధనలో కీలకపాత్ర పోషించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నా తెలంగాణ కోసం పదవికి రాజీనామా చేయడం, నిరాహార దీక్ష చేపట్టడం, రాజకీయంగా ప్రతి ఘటనలను ఎదుర్కొంటూ ప్రజల గొంతుకగా మారడం ఇవన్నీ ఉద్యమానికి ఊపునిచ్చాయన్నారు. 2001లో టీఆర్ఎస్ స్థాపనతో మొదలైన పోరాటం 2014 జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావంతో విజయవంతమైంది. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పదేళ్లపాటు తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించారు. నీటి ప్రాజెక్టులు, రైతు బంధు, విద్యుత్, సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.