ఖిలావరంగల్: బీసీలందరికి(BCs) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) భేషరతుగా క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. బుధవారం శివనగర్ సాయి కన్వెన్షన్ హాలులో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బీసీలకు జరుగుతున్న మోసంపై నోరు మెదపడం లేదని విమర్శించారు.
రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ చేసి తర్వాత మాట మార్చారన్నారు. బీసీ సర్వే తప్పుడు సర్వే అని అంగీకరించిన ప్రభుత్వం రీ సర్వే చేయడానికి సుముఖత చూపిస్తున్నారంటే మొదట చేసిన సర్వే వంద శాతం తప్పే అని అంగీకరించినట్లేనన్నారు. తప్పుల తడకగా మార్చి తప్పుడు సర్వే వివరాలను వెల్లడించిన సీఎం రేవంత్రెడ్డి ప్రతి బీసీ బిడ్డకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కుల గణన సర్వేలో బీసీలు 45.5 శాతం మాత్రమే ఉన్నారని సర్వే చేశారని విమర్శించారు. 2014లో నాటి సీఎం కేసీఆర్ సకుటుంబ సర్వే చేయిస్తే బీసీలంతా 51 శాతం ఉన్నట్లు గణాంకాలు చెప్పాయన్నారు.
51 శాతం ఉన్న బీసీలు పదేళ్ల తర్వాత 45.5 శాతం ఎట్లా అయితదో చెప్పాలన్నారు. బీసీల సంతోనోత్పత్తి జరగకుండా కేవలం అగ్రవర్ణాల సంతానోత్పత్తి పెరిగిందా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎన్నికలను వాయిదా వేసుకొని రీ సర్వే ప్రక్రియ మొదలు పెట్టారని మండిపడ్డారు. కుల గణనపై రీ సర్వే చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు కాబట్టి గ్రామాల్లో, వాడలలో బీసీ సంఘాల నాయకులు సర్వే చేయాలని కోరారు.