కరీమాబాద్, ఏప్రిల్ 16 : నాడు ప్రధాని మోదీ.. నేడు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై పార్లమెంట్ సాక్షిగా తమ విద్వేషాన్ని వెళ్లగక్కారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఉద్యమసారథి కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్ల పాటు శాంతియుతంగా జరిగిన మలిదశ ఉద్యమ పోరాటంలో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలు, త్యాగాల పునాదులపై జరిగిన రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ కుసంస్కార వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను అమరుల ఆత్మబలిదానాలను అవమానించినట్లేనన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలున్నా ఈ వ్యాఖ్యలపై నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన బీజేపీ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.