అత్యాధునిక హంగులు.. కొంగొత్త ఫీచర్లు.. చూడగానే ఆకట్టుకునే రంగులు.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్న కార్లు, బైక్‌లు వాహనప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి. నగరవాసుల సౌలభ్యం కోసం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో అన్ని కంపెనీల వాహనాలను ఒక్కచోట చేర్చి నిర్వహిస్తున్న ఆటో షో శనివారం ప్రారంభమైంది. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా తొలిరోజు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. బెంజ్, లెక్సస్ కార్లతో పాటు బీఎండబ్ల్యూ బైక్‌లు ఆకట్టుకోగా ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పెషల్, ఎక్సేంజ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో పాటు ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. నగరవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమకు నచ్చిన కార్లు, బైక్‌లను గురించి తెలుసుకోవడంతో పాటు టెస్ట్ డ్రైవ్ చేశారు. మరికొందరు అక్కడికక్కడే బుక్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు మొదలై.. రాత్రివరకూ వచ్చి వెళ్లే సందర్శకులతో హయగ్రీవాచారి మైదానంలో సందడి నెలకొంది. ఆటోషోకు వచ్చిన సందర్శకులకు లక్కీడిప్ ద్వారా బహుమతులు అందించగా నేడు (ఆదివారం) కూడా ఆటోషో కొనసాగనున్నది.
-నయీంనగర్, నవంబర్ 15

ఆధునిక టెక్నాలజీతోపాటు సరికొత్త ఫీచర్లు కలిగిన బీఎండబ్ల్యూ బైక్ లు ప్రదర్శనలో పాల్గొన్నాయి. అయితే ఈ కంపెనీ షోరూం హైదరాబాద్‌లోనే ఉండడంతో వరంగల్ నగర వాసుల కోసం వాటిని ఈ ప్రదర్శనకు తీసుకువచ్చారు. అయితే ఆర్1300 జీఎస్ ట్రోఫీ ఎడిషన్ బైక్ ధర రూ. 31 లక్షలుండగా, ఎఫ్900జీఎస్ బైక్ రూ. 19లక్షలు, జీ310ఆర్ఆర్ స్పోర్ట్స్ బైక్ 4 లక్షలు, ఈవీ-సీ02 (ఎలక్ట్రిక్ బైక్) రూ. 5.50 లక్షలుండగా ఆఫర్ కింద రూ. 3లక్షలకే అం దజేస్తున్నారు.

సామాన్య ప్రజల కోసం రూ. 3,27,800కే కారును ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందిస్తున్నది. 15 నిమిషాల్లో ఫైనాన్స్ ఇప్పించి, జీరో డౌన్ పేమెంట్‌తో అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా మారుతి సుజుకి సంస్ధ ఏర్పాట్లు చేసింది. డ్రైవింగ్ రాని వారికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా కమర్షియల్ వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ వారు ఎప్పుడు ఆటో షో పెట్టినా మేము స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ఈ ఆటో షోకు ఎంతో ఆదరణ లభిస్తున్నది. ఇంత మంచి అవకాశం కల్పించిన ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ నిర్వాహకులకు కృతజ్ఞతలు.
– కేఎస్ కల్యాణ్, జనరల్ మెనేజర్, ఆదర్శ ఆటోమోటివ్స్, ములుగు రోడ్డు
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఏర్పాటు చేసిన ఆటో షో వాహన ప్రియులకు మేలు చేసేదిగా ఉంది. ఒక షోరూం పోయి ఒకే వాహనాన్ని చూస్తాం. కానీ ఇక్కడ అన్ని వాహనాలను ఒకే దగ్గర చూడగలం. అంతేకాకుండా ఫైనాన్స్ సదుపాయం కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు జనాలకు ఎంతగానో ఉపయోగపడుతాయి.
– సురేశ్‌రెడ్డి, జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్, హనుమకొండ
ఆటో షోలో మొదటి సారి స్టాల్ పెట్టాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. లెక్సస్ కార్లను వ్యాపారులు, సెలబ్రిటీలు ఎక్కువగా తీసుకుంటారు. వీటి ధర రూ. 81 లక్షల నుంచి రూ. 4 కోట్ల వరకు ధర ఉంటుంది. చూడడానికి ఎంతో రిచ్‌గా ఉంటుంది.
– దినేష్ కుమార్, లెక్సస్, మార్కెటింగ్ హెడ్
బెంజ్ కారు ధర ఎక్కువ ఉన్నా కూడా చాలా మంది కస్టమర్లు వివరాలు తెలుసుకుంటున్నారు. మా కార్లను బుక్ చేసేందుకు వరంగల్, హనుమకొండ నుంచి కస్టమర్లు హైదరాబాద్‌లోని మా షోరూంకు వస్తుంటారు.
– తరుణ్ సేల్స్మెనేజర్, బెంజ్ మహావీర్ మోటర్స్
వరంగల్, హనుమకొండలోని చాలా మందికి ప్రతి నెల హైదరాబాద్ నుంచి వచ్చి టెస్ట్ డ్రైవ్ ఇచ్చి వెళ్తాం. ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఏర్పాటు చేసిన ఈ ఆటో షో చాలా బాగుంది. జనాలు వచ్చి ఎంక్వయిరీ చేసుకొని వెళ్తున్నారు.
– వినోద్ కుమార్, బీఎండబ్ల్యూ కున్ ఎక్స్‌క్లూజీవ్