నమస్తే తెలంగాణ నెట్వర్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ విత్తనాలు మొదలుకొని ఎరువులు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్న వడ్లకు బోనస్, రైతు భరోసా, రుణమాఫీ, కరెంట్ కోతలు, పంట నష్టపరిహారం తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నడుం బిగించింది.
అన్నదాతల అరిగోసను, ఆక్రందనను, ఆందోళనలను, యూరియా కోసం ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ క్యూలో నిల్చున్న, చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి పడిగాపులు పడిన వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా క్షేత్రస్థాయి ఫొటోలతో వార్తలను ప్రచురించి రైతులకు అండగా నిలిచింది. కాల్వల దుస్థితి, ప్రాజెక్టుల నుంచి చుక్కనీరు రాని పరిస్థితిని, సాగు నీటి కోసం రైతులు పడుతున్న గోసను వెలుగులోకి తీసుకొచ్చింది. పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ అధికారులు స్పందించేలా, సమస్యలు పరిష్కరించేలా కృషి చేసింది. గడిచిన రెండేళ్లలో అన్నదాతలు ఎదుర్కొన్న ఇబ్బందులపై ప్రచురితమైన వాటిలో మచ్చుకు కొన్ని ‘సచిత్ర’ కథనాలు..